కర్ణాటకలో ఓలాకు షాక్‌


బెంగళూరు: ప్రముఖ క్యాబ్‌ సర్వీస్‌ సంస్థ ‘ఓలా’కు కర్ణాటకలో షాక్‌ తగిలింది. ఓలా ట్యాక్సీలు, ఆటోలపై ఆ రాష్ట్ర రవాణాశాఖ ఆరు నెలల పాటు నిషేధం విధించింది. అనుమతి లేకుండా బైక్‌ ట్యాక్సీలను నడుపుతున్నందుకు గానూ రవాణాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలను నడపం నిషేధం. అయితే నిబంధనలను ఉల్లంఘిస్తూ గత జనవరి నుంచి ఓలా బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో బైక్‌ ట్యాక్సీలను నిర్వహిస్తోంది. దీంతో రవాణాశాఖ ఓలాకు గతంలో షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. వీటికి స్పందించిన సంస్థ.. ప్రజల నుంచి సమాచారం సేకరించేందుకు బీటా పైలట్‌ ప్రాజెక్టు కింద ఈ ట్యాక్సీలను నడుపుతున్నామని తెలిపింది. అయితే సంస్థ ఇచ్చిన వివరణ అసంపూర్ణంగా ఉండటంతో ఓలాపై రవాణాశాఖ చర్యలు చేపట్టింది. ఆరు నెలల పాటు ఓలా లైసెన్సును సస్పెండ్‌ చేస్తున్నట్లు తెలిపింది. కంపెనీ ట్యాక్సీలు, ఆటోలు నడపకుండా నిషేధం విధించింది.

ఈ నిషేధంపై ఓలా అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘ఇది చాలా దురదృష్టకరం. చట్టాలకు అనుగుణంగానే ఓలా వ్యవహరిస్తుంది. ప్రజల రవాణా సదుపాయాలు మెరుగుపర్చేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుంది. ఈ విషయంపై అధికారులతో చర్చిస్తున్నాం’ అని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.