లోక్‌సభ బరిలోకి దిగుతున్న మరో హీరోయిన్!


బెంగళూరు: బెంగళూరు గ్రామీణ లోక్‌సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా ప్రముఖ మోడల్‌, సినీ నటి నిషా యోగేశ్వర్‌కు చాన్స్‌ దక్కనుం దా..? బీజేపీ వర్గాలు ఔననే సమాధానమిస్తున్నాయి. ఇందుకు తగ్గట్టుగా బీజేపీ తొలి జాబితాలో బెంగళూరు గ్రామీణ నియోజవకర్గానికి అభ్యర్థి పేరును పెండింగ్‌లో ఉంచారు. నటుడు మాజీమంత్రి సి.పి.యోగేశ్వర్‌ పేరును రాష్ట్ర పార్టీ నేతలు అధిష్ఠానానికి సిఫారసు చేసిన సంగతి విదితమే. అయితే జాతీయ రాజకీయాలలోకి వెళ్ళేందుకు ఆసక్తి చూపడం లేదు. తన బదులు తన కుమార్తె నిషా యోగేశ్వర్‌కు టికెట్‌ ఇవ్వాలని సూచించారు. 29ఏళ్ళ నిషాకు రాజకీయాలు కొత్తేమీ కాదు. చెన్నపట్టణంలో తన తండ్రి సి.పి.యోగేశ్వర్‌ తరపున ఇంటింటికీ వెళ్ళి ఓట్లను అభ్యర్థించి ప్రచారం చేశారు. నిజానికి 2018 శాసనసభ ఎన్నికలలోనే చెన్నపట్టణ నుంచి నిషా పేరు తెరపైకి వచ్చింది.
 
 
మోడలింగ్‌లో పేరు ప్రఖ్యాతులు గడించి ఫ్యాషన్‌ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన నిషా అమెరికాలో ఎం.ఎస్‌.చదివింది. ప్రస్తుతం మోడల్‌ గాను, నటిగానూ బిజీగా ఉంటూనే తండ్రికి సంబంధించిన వ్యాపార లావాదేవీలు చూసుకుంటోంది. ఒకవేళ బెంగళూరు గ్రామీణ నుంచి నిషా బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగితే ఈ నియోజకవర్గానికి పోటీ చేసిన తొలి మహిళగా అరుదైన ఖ్యాతిని తన సొంతం చేసుకోవడం ఖాయం. కనకపుర పేరిట ఉన్న ఇదే నియోజకవర్గం నుంచి గతంలో మాజీ ప్రధాని దేవేగౌడపై పోటీ చేసిన పాత్రికేయురాలు తేజస్విని రమేశ్‌ భారీ విజయం సాధించారు. అయితే బెంగళూరు గ్రామీణగా పేరు మారాక మరోమారు ఇక్కడ పోటీ చేసిన తేజస్విని ప్రస్తుత ముఖ్యమంత్రి కుమారస్వామి చేతిలో ఓడిపోయారు. 2013లో ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సి.పి.యోగేశ్వర్‌ రెండోస్థానం పొందారు.