కాంగ్రెస్‌ కకావికలం


తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ కకావికలం అవుతోందని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సొంత జిల్లాలోనే ఆ పార్టీ పునాదులు కదులుతున్నాయని, ఆ జిల్లా నుంచి కాంగ్రెస్‌ సర్పంచులు టీఆర్‌ఎస్ లో చేరడమే దీనికి సంకేతమని పేర్కొన్నారు. జీవనదిలో పాయలు చేరినట్లుగా రాష్ట్రవ్యాప్తంగా ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్ లో చేరుతున్నారని అభివర్ణించారు. కాంగ్రెస్‌ దేశ వ్యాప్తంగానూ గాడి తప్పిందన్నారు. శుక్రవారం నాగార్జునసాగర్‌ నియోజకవర్గానికి చెందిన 15 మంది సర్పంచులు, షాద్‌నగర్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యేలు ప్రతాప్ రెడ్డి, భీష్మ కిష్టయ్య, పలువురు కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు కేటీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్ లో చేరారు. తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో వారికి కేటీఆర్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పాలకుల హయాంలో పల్లెపల్లెనా పల్లేర్లు మొలిచిన పాలమూరు జిల్లా నేడు పచ్చబడుతోందని అన్నారు. కల్వకుర్తి లిప్ట్‌ ఇరిగేషన్‌తోపాటు మరిన్ని ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడం ద్వారా జిల్లావ్యాప్తంగా 8లక్షల ఎకరాలకు సాగునీరందించామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ను గెలిపించాం కదా.. మళ్లీ టీఆర్‌ఎస్ కు ఎందుకు ఓటెయ్యాలి అంటూ కాంగ్రెస్‌, బీజేపీ నేతలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ కు ఓటేస్తే రాహుల్‌గాంధీకి, బీజేపీకి ఓటేస్తే మోదీకి లాభమని, టీఆర్‌ఎస్ కు ఓటేస్తే తెలంగాణ రాష్ట్రానికి లాభమని పేర్కొన్నారు.
 
 
ఇద్దరు ఎంపీలతో తెలంగాణను తెచ్చిన మొనగాడని, అలాంటిది 16 సీట్లు ఇస్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎన్ని వేల కోట్ల నిధులను తీసుకువస్తారో ఆలోచించాలని సూచించారు. గత పాలకుల హయాంలో పాలమూరులో అన్నీ పెండింగ్‌ పాజ్రెక్టులేనని, టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక అవి కాస్త రన్నింగ్‌ ప్రాజెక్టులు అయ్యాయని చెప్పారు. రాష్ట్రంలో 16 స్థానాల్లో గెలిచి, కేంద్రంలో నిర్ణయాత్మక శక్తిగా టీఆర్‌ఎస్‌ మారితే పాలమూరు-రంగారెడ్డి పాజ్రెక్టుకు జాతీయ హోదా తన్నుకుంటూ వస్తుందని అన్నారు. ఇదిలా ఉండగా.. ఎన్‌ఎ్‌సయూఐ జాతీయ కార్యదర్శి వీర వల్లబ్‌, మహబూబాబాద్‌ జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు గుగులోతు సుచిత్ర.. కాంగ్రెస్‌ పదవులకు రాజీనామా చేసి కేటీఆర్‌ సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు.