మూడు రాజధానులకు మా మద్దతు


  • రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక
  • రాజధాని లేదా హైకోర్టును ఎంచుకునే స్వేచ్ఛ సీమ ప్రజలకు ఇవ్వాలి
  • కృష్ణా నది యాజమాన్య బోర్డు కర్నూలులో ఏర్పాటు చేయాలి

పాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానులపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నట్లు రాయలసీమ ప్రజాసంఘాల సమన్వయ వేదిక పేర్కొంది. మంగళవారం తిరుపతిలోని అగరాల ఈశ్వర్‌రెడ్డి డిగ్రీ కళాశాలలో వివిధ ప్రజా సంఘాలు సమావేశం నిర్వహించాయి. కార్యక్రమానికి బొజ్జా దశరథరామిరెడ్డి అధ్యక్షత వహించారు. శాసనసభ మాజీ స్పీకర్‌ అగరాల ఈశ్వర్‌రెడ్డి, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్‌ పురుషోత్తంరెడ్డి, తిరుపతికి చెందిన మాంగాటి గోపాల్‌రెడ్డి, నవీన్‌కుమార్‌రెడ్డి, ప్రొఫెసర్‌ రంగారెడ్డి, ప్రొఫెసర్‌ దేవిరెడ్డి సుబ్రహ్మణ్యంరెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు 10 తీర్మానాలు చేశారు. ఆ తీర్మానాల్లో ముఖ్యమైన అంశాలు ఇవీ..

►జీఎన్‌ రావు కమిటీ శ్రీబాగ్‌ ఒప్పందాన్ని తన నివేదికలో ప్రస్తావించింది. ఈ ఒప్పందం ప్రకారం రాజధాని లేదా హైకోర్టును ఎంచుకునే స్వేచ్ఛను రాయలసీమ వాసులకివ్వాలి. హైకోర్టుతో పాటు శాసన, పాలనా వ్యవస్థకు సంబంధించిన విభాగాలు రాయలసీమలో ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలి.

►విభజన చట్టంలో 11వ షెడ్యూల్‌ ప్రకారం నిర్మాణంలో ఉన్న గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలిగొండ ప్రాజెక్ట్‌ను పూర్తిచేయాలి. వెనుకబడిన ప్రాంతాలకు, సీమలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలి.

►కృష్ణ, తుంగభద్ర జలాల్లో రాయలసీమ జిల్లాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. శ్రీశైలం ప్రాజెక్ట్‌ను పూర్తిగా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లాలకు కేటాయించాలి.∙తుంగభద్ర ఎగువ దిగువ కాలువలు, కేసీ కెనాల్‌ కింద నీటిని సక్రమంగా కేటాయించాలి.

►కృష్ణా నది యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలి. ∙విభజన చట్టంలోని 13వ షెడ్యూల్‌లో ఉన్న ఎయిమ్స్, కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాయలసీమలో ఏర్పాటు చేయాలి.

►కడపలో మైనింగ్‌ వర్సిటీ, తిరుపతిలో క్యాన్సర్‌ ఆస్పత్రి, శ్రీశైలంలో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి.

►గుంతకల్‌ కేంద్రంగా రైల్వేజోన్, సెయిల్‌ ఆధ్వర్యంలో కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలి.

►కర్నూలును సీడ్‌ హబ్‌గా అభివృద్ధి చేయడంతో పాటు అక్కడ వ్యవసాయ కమిషనరేట్, విత్తన ధ్రువీకరణ కేంద్రాలను ఏర్పాటు చేయాలి.

►విభజన చట్టంలోని 9వ షెడ్యూల్‌లో ఉన్న 83 ప్రభుత్వ కార్పొరేషన్‌లను, 10వ షెడ్యూల్‌లో ఉన్న 107 రాష్ట్రస్థాయి శిక్షణ సంస్థలను రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలి.