శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో వర్షం


శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లాలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం ఇచ్ఛాపురం, పలాస, నరసన్నపేట నియోజకవర్గ ప్రాంతాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. అలాగే శ్రీకాకుళం, ఆమదాలవలసల్లో ఉరుములుతో కూడిన భారీ వర్షం పడుతోంది. జిల్లా అంతటా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని తేలికపాటి వాన కురుస్తోంది. వేసవి వేడిగాలులతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వానలు ఊరటనిస్తున్నాయి.

విజయనగరం జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షం పడుతోంది. పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం , కురుపాం, కొమరాడ, బొబ్బిలి, మక్కువ, విజయనగరంలో ఉరుములతో కూడిన జల్లులు పడ్డాయి. విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం పడుతోంది. మరోవైపు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని.. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ సూచనలు చేసింది.