గల్లాపెట్టె గలగల


గర, పురపాలక సంఘాల్లో ప్రభుత్వం ప్రకటించిన ఆస్తి పన్ను రాయితీకి మంచి ఆదరణ లభించింది. ఈ పథకాన్ని పురవాసులు బాగా సద్వినియోగం చేసుకున్నారు. వార్షిక డిమాండ్‌లో 40 శాతం పన్ను రుసుములు ఒక్క ఏప్రిల్‌ మాసంలోనే వసూలు కావటంతో పురపాలక, నగరపాలక వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. మొత్తానికి పురపాలక, నగరపాలకలో రాయితీ పథకంతో కాసులు గలగలాడుతున్నాయి.  వాస్తవానికి ఆస్తి పన్నును మార్చి నెలాఖరులోనే ఎక్కువుగా చెల్లింపులు చేస్తారు. అప్పటి దాకా బిల్‌కలెక్టర్లు, ఇన్‌స్పెక్టర్లు, ఆర్వోలు ఎదురుచూడటం మినహా మరో మార్గం ఉండేది కాదు. అలాంటిది గుంటూరు నగరపాలక కమిషనర్‌గా కన్నబాబు పనిచేసినప్పుడు రాష్ట్రంలోనే తొలిసారిగా గుంటూరు నగరపాలక సంస్థలో  ఏడాది ఆస్తి పన్ను మొత్తాన్ని ఒకేసారి ఏప్రిల్‌ మాసంలో చెల్లిస్తే పన్ను డిమాండ్‌పై ఐదు శాతం రాయితీని ఇచ్చేలా 2015-16లో రాయితీ పథకానికి శ్రీకారం చుట్టారు. అప్పట్లో ఇది మంచి సత్ఫలితాలను ఇచ్చింది. దీంతో ఆయన పురపాలకశాఖ సంచాలకులుగా నియామకమయ్యాక గడిచిన ఆర్థిక సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగర, పురపాలక సంఘాల్లో దీన్ని ఏకకాలంలో ప్రవేశపెట్టారు. అప్పట్లో పెద్దగా దీనికి స్పందన లేదు. అయితే గతేడాది దీనికి సంబంధించి   గుంటూరు నగరపాలక సంస్థలో మంచి ప్రచారం నిర్వహించటంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గుంటూరు నగరవాసులు బాగా సద్వినియోగం చేసుకున్నారు. గుంటూరు నగరపాలక మొత్తం డిమాండ్‌లో 40 శాతం వరకు ఒక్క ఏప్రిల్‌ మాసంలోనే వసూలు కావటంతో  నగరపాలక యంత్రాంగంలో హర్షం వ్యక్తమవుతోంది.

రెండు జిల్లాల్లోని పురపాలికల్లో.. : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన ఆస్తి పన్ను మొత్తాన్ని  ఏప్రిల్‌ నెలాఖరిలోపు ఒకేసారి చెల్లింపులు చేసిన వారికి ఐదు శాతం రాయితీ ప్రకటించారు. ఈపధకాన్ని కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని అన్ని నగరపాలక, పురపాలక సంఘాలు సద్వినియోగం చేసుకున్నాయి. వార్షికంగా రూ.లక్షకు పైబడి పన్ను చెల్లించేవారంతా ఈ రాయితీ పథకాన్ని బాగా వినియోగించుకున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, మధ్యతరగతి వర్గాలు, వ్యాపారులు ఎక్కువుగా ఆసక్తి కనబరిచారు.  సహజంగా పుర, నగరపాలక సంస్థల్లో ఆస్తిపన్నును రెండు విడతలుగా చెల్లింపులు చేసుకునే సౌలభ్యం ప్రజలకు ఉంది. మొదటి ఆర్నెల్లకు సంబంధించిన పన్ను సెప్టెంబరు 30 లోగా,  ఆతర్వాత ఆర్నెల్ల డిమాండ్‌ను మార్చి 31 లోగా చెల్లించుకోవచ్చు. అయితే ఇలా విడతల వారీగా చెల్లింపులు చేయవచ్చు. అయితే ఇలా విడతల వారీగా చెల్లించే వారికి ఐదు శాతం రాయితీ వర్తించదు. దీంతో అపార్టుమెంటువాసులు, పెద్ద పెద్ద భవనాలు కలిగినవారు, షాపింగ్‌ కాంప్లెక్సులు కలిగిన యాజమాన్యాలు ఈ రాయితీ పథకానికి స్పందించి ముందస్తుగా పన్ను చెల్లింపులు చేసి ఈమేరకు ఐదు శాతం రాయితీని పొందారని నగరపాలక రెవెన్యూ వర్గాలు వెల్లడించాయి.

ఏప్రిల్‌ డిమాండ్‌ అవలీలగా..: నగర, పురపాలక సంఘాల్లో  ఆస్తి పన్ను డిమాండ్‌ను నెలవారీగా విభజించి ఆమేరకు వసూలు చేయాల్సిన లక్ష్యాన్ని యంత్రాంగానికి సూచిస్తారు. ఆమేరకు ప్రతి నెలా డిమాండ్‌ను అధిగమించటంపైనే  ఎక్కువగా కసరత్తు జరిపినా చాలా మంది మొదటి ఆర్నెల్ల డిమాండ్‌ను సెప్టెంబరు నెలాఖరిలోపు, ఆ తర్వాత చెల్లించాల్సిన ఆర్నెల్ల డిమాండ్‌ను మార్చిలో  చెల్లింపులు చేసేవారు. దీంతో నెలవారీ లక్ష్యాలు కూడా సాధించటం కష్టంగానే ఉండేది. అలాంటిది ఈఏడాది ఏప్రిల్‌ మాసంలో  కొన్ని పురపాలక సంఘాల్లో నూరు శాతం పైబడి వసూలైంది. మరికొన్ని సంఘాల్లో అయితే 200 శాతం పైబడి వచ్చినట్లు అధికారులు తెలిపారు. రాయితీ పథకం వల్ల రెండు, మూడు మాసాలకు సరిపడా ఆదాయం ఒకేసారి లభ్యమైందని దీనివల్ల అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడానికి మంచి అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. గుంటూరు జిల్లాలోని గుంటూరు నగరపాలక సంస్థతో కలిపి మొత్తం 13 పురపాలక సంఘాల్లో ఈ ఏడాది ఆస్తి పన్ను డిమాండ్‌ రూ.151.73 కోట్లుగా నిర్ణయించారు. నిర్దేశిత డిమాండ్‌లో ఒక్క ఏప్రిల్‌ మాసంలోనే రూ.27.38 కోట్లు వసూలు అయింది. వాస్తవానికి ఏప్రిల్‌ నెలలో వసూలు చేయాల్సిన పన్ను లక్ష్యం రూ.12 కోట్లు. అయితే అందుకు రెట్టింపు ఆదాయం సాధ్యపడింది. కృష్ణా జిల్లాలో విజయవాడ నగరపాలక సంస్థతో సహా 9 పురపాలక సంఘాలు ఉన్నాయి. వీటి నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.137.87 కోట్లు వసూలు చేయాలనేది లక్ష్యం. అయితే ఏప్రిల్‌ 30 సాయంత్రం 6 గంటల వరకు పరిశీలిస్తే  ఆ లక్ష్యంలో రూ.12.33 కోట్లు వసూలైంది. సోమవారం సాయంత్రం 5 గంటలకు వరకు వసూలైన పన్ను రుసుములు రెండు జిల్లాల్లోని పురపాలక, నగరపాలక సంస్థల్లో ఇలా ఉన్నాయి.