హోరెత్తిన పోరు


రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కోటి ఆశల ఆకాంక్షలు ప్రజ్వరిల్లిన వేళ.. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి పాదాల చెంత తెదేపా పూరించిన సమరశంఖం నలుదిక్కులా వినిపించింది. కేంద్రంతో హోదా యుద్ధానికి సిద్ధమంటూ ఆ పార్టీ గిరిగీసి బరిలోకి దిగింది. సోమవారం తిరుపతిలోని తారకరామ స్టేడియంలో జరిగిన ‘ధర్మ పోరాటం’ సభకు భారీగా జనం తరలివచ్చారు. మైదానం కిక్కిరిసిపోయి జన సందోహం బయటకు వచ్చింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ... తెదేపా అధినేత చంద్రబాబు కోరిన ప్రతిసారి చప్పట్లు మార్మోగాయి. నాలుగేళ్లు ఓపిక పట్టి... మద్దతునిచ్చినా... మాకు ఒరిగిందేం లేదని... ఇక తాడోపేడో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందంటూ ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపునకు ప్రతి ఒక్కరూ హర్షధ్వానాలు చేశారు.

హోదాకు జేజేలు 
తిరుపతి వేదికగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన ధర్మ పోరాటానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. సభకు చిత్తూరు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఎన్నికల సభ మాదిరిగా... తెదేపా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతోసహా... పార్టీ నేతలంతా హాజరయ్యారు. ప్రత్యేక హోదా ప్రధాన ఏజెండాగా.. తెదేపా వేసిన తొలి అడుగులో చిన్న, పెద్దా, ముసలి, ముతక అంతా పాల్గొనడం పార్టీలో ఉత్సాహాన్ని నింపింది. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న ప్రతి మాటకు కార్యకర్తలు, ప్రజల నుంచి మంచి మద్దతు లభించింది. నాలుగేళ్ల ముందు... ఇదే వేదికపై ప్రధాని అభ్యర్థి అయిన నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ ఏమైంది తమ్ముళ్లు..? అనగానే పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన వచ్చింది. రాష్ట్రంపై కేంద్ర నిర్లక్ష్యాన్ని చంద్రబాబు ఎత్తి చూపిన ప్రతిసారీ ఆయనకు వేదికపై ఉన్న నాయకులు, ప్రజల నుంచి సంఘీభావం లభించింది. ఇక సభ ముందుగా.. గతంలో తిరుపతి వేదికగా నాలుగేళ్ల క్రితం ప్రధాని అభ్యర్థిగా ఎన్నికల ప్రచారానికి వచ్చిన సమయంలో నరేంద్రమోదీ చేసిన ప్రసంగాలను, నెల్లూరులో చేసిన ప్రసంగాలను ఆయన వీడియో రూపంలో ప్రజలకు ప్రదర్శించారు.

లెక్కలతో సహా ఎండగడుతూ... 
కేవలం ప్రత్యేక హోదా విషయమే కాదు.. పోలవరం, అమరావతి నిర్మాణం, విభజన చట్టం అమలు విషయాలను ఆయన లెక్కలతో సహా చంద్రబాబు వివరించే ప్రయత్నం చేశారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేసిన ప్రభుత్వ సంక్షేమ పథకాలను చెబుతూ.. అటు కేంద్రం నుంచి ఎలాంటి సాయం రాకపోవడాన్ని ప్రస్తావించారు. రాష్ట్రానికి కేంద్రం ఎంత సహాయం చేసిందో లెక్కలతో సహా చెప్పారు. ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వలేం... అని చెబుతూనే కొన్ని రాష్ట్రాలకు ఇవ్వడాన్ని ఆయన ఎత్తి చూపారు. దిల్లీ కంటే గొప్ప రాజధాని కట్టుకోండి... మేం సహాయపడతాం అని చెప్పి మాట మార్చారని దుయ్యబట్టారు. ఏ విషయంలోనే కేంద్రం రాష్ట్రానికి సాయం చేయలేదని.. మాయమాటలు చెప్పి ఇంతకాలం గడిపేశారని.. ఇక మీదట అలా జరగడానికి వీల్లేదంటూ బాబు మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీ కేవలం కేసులను మాఫీ చేయించుకోవడానికి పెట్టిన శ్రద్ధను... రాష్ట్రంపై పెడితే ఎంతో మేలు జరిగేదని ప్రతిపక్షాల పాత్రను ఎండగట్టే ప్రయత్నం చేశారు. ‘రాష్ట్రానికి కష్టం వచ్చినప్పుడు అంతా కలిసికట్టుగా పోరాడాలి.. అయితే రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న భాజపాతో ఎప్పుడెప్పుడు కలిసిపోదామా? అని ప్రతిపక్షం చూస్తోంది? ప్రజలకు వీరేం సమాధానం చెబుతారు. ఇది ద్రోహం కాదా..’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అంతా కలిసికట్టుగా పోరాడుదామని, ఇది తొలి అడుగు మాత్రమేనని, ముందు మహా పోరాటం మొదలవబోతోందని చెప్పారు. ఇక సభ మొదలు దగ్గర నుంచి చివరి వరకూ... హోదా ఇవ్వాల్సిందేనంటూ ప్రజల నుంచి నినాదాలు వినిపించాయి. చంద్రబాబు అందరితో ప్రత్యేక హోదా... ఆంధ్రుల హక్కు అంటూ నినదించేలా చేసి... పోరాటానికి మరింత ఉత్తేజం కలిగించారు.