బినామీ డీలర్ల దందా


ప్రజా పంపిణీ వ్యవస్థలో బినామీ డీలర్ల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఇటీవల నిర్వహించిన సామాజిక తనిఖీ (సోషల్‌ ఆడిట్‌)లో గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి, నరసరావుపేట, వేమూరు, గుంటూరు నియోజకవర్గాల పరిధిలోనే 300 మంది బినామీ డీలర్లు ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ గుర్తించింది. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల పరిధిలోని 29వేల చౌకధర దుకాణాల్లో ఎంతమంది బినామీల చేతుల్లో ఉన్నాయనేదీ తేలాల్సి ఉంది. ఇందుకోసం పౌరసరఫరాల శాఖ కసరత్తు ప్రారంభించింది. డీలర్లకు మాత్రమే ఈ-పాస్‌లో గుర్తింపు ప్రామాణీకరణ (అథెంటికేషన్‌) ఇవ్వాలని అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే 2013 జూన్‌లో జారీ చేసిన జీఓఎంఎస్‌ 16లో డీలరు కుటుంబ సభ్యుల్లో భార్య, పెళ్లి కాని కుమార్తె, కుమారుడులకు నామినీ అథెంటికేషన్‌ ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ జీఓకు వ్యతిరేకంగా ఇప్పుడు అధికారులు అసంబద్ధ నిర్ణయాలు తీసుకుంటూ డీలర్లను వేధింపులకు గురిచేస్తున్నారంటూ డీలర్ల ప్రతినిధులు విమర్శిస్తున్నారు. డీలర్ల ఆందోళన నేపథ్యంలో నామినీ విషయంలో పౌరసరఫరాల శాఖ అధికారులు స్పందించారు..డీలరు రక్త సంబందీకుల్లో ఒకరికి అదీ డీలరు రేషన్‌ కార్డులో పేరున్న వ్యక్తి ఒకరికి మాత్రమే నామినీగా అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ పిల్లలు లేనివారులాంటి ప్రత్యేక సమస్యలున్న డీలర్లకు నామినీ విషయంలో సంయుక్త కలెక్టర్లు జిల్లాస్థాయిలోనే నిర్ణయం తీసుకునే ఏర్పాటు చేశారు.

సాంకేతికతతో సాధించిందేమిటో.. 
ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలను నిరోధించేందుకే ఈ-పాస్‌ యంత్రాలను  చౌకధర దుకాణాల్లో ఏర్పాటు చేశారు. ఇందుకోసం సుమారు రూ.150 కోట్లమేరకు వెచ్చించారు. డీలరు వేలిముద్ర వేస్తేనే ఈ-పాస్‌లో సరకుల పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. వాటిని ఏర్పాటు చేసినపుడే డీలర్ల వేలిముద్రలు తీసుకున్నారు. అలాంటపుడు బినామీ డీలర్లు ఎలా వస్తారు? వారు ఈ-పాస్‌ యంత్రాలను ఎలా వినియోగిస్తున్నారనేదీ అధికారులకు తెలియదా అన్నది నేడు చర్చనీయాంశమైంది.

పెరిగిపోయిన రాజకీయ జోక్యం 
డీలర్ల మార్పు, బినామీలను ప్రోత్సహించడంలో రాజకీయ నేతల జోక్యం మితిమీరుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రజాప్రతినిధులే వారికి కావాల్సిన వారిని రేషన్‌ డీలర్లుగా ఎంపిక చేయిస్తున్నట్లు అధికారులే అనధికారిక చర్చల్లో చెబుతున్నారు. కొందరు డీలర్లు వారి కుటుంబ సభ్యుల పేర్లతో ఒకటికి మించి దుకాణాలను నిర్వహిస్తున్నట్లు పలు సందర్భాల్లోనూ బయటపడింది.

కుటుంబ సభ్యులను నామినీగా కొనసాగించాలి... 
డీలరు కుటుంబ సభ్యుల్లోని ఇద్దరు సభ్యులకు నామినీ అవకాశాన్ని గతంలోలాగే కొనసాగించాలి. లేకపోతే మే 1 నుంచి సరకుల పంపిణీ నిలిపివేసి ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తహశీల్దార్ల, జిల్లా కేంద్రాల్లో కలెక్టర్‌ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహిస్తాం. బినామీల విషయం అధికారులకు తెలియనిదా? వారు సక్రమంగా వ్యవహరిస్తే బినామీ డీలర్లను ఏరివేయడం పెద్ద పని కాదు. కానీ, వారి తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు ఇతర డీలర్లను వేధింపులకు గురిచేయడం తగదు.