రూ.1.62 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం


విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే: విశాఖ జిల్లా నర్సీపట్నం నుంచి మహారాష్ట్రలోని వడోదరకు సోడియం బైక్రోమేట్‌ ముసుగులో అక్రమంగా రవాణా అవుతున్న గంజాయిని డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటిలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు ఆదివారం వలపన్ని పట్టుకున్నారు. విజయవాడ రింగ్‌రోడ్డు (ఎన్‌హెచ్‌16)పై నిలిపి ఉన్న ఏపీ31టీహెచ్‌6655 నెంబరు లారీని అనుమానంతో తనిఖీ చేశారు. అందులో 500 మూటల్లో సర్ధి ఉంచిన 1085 కిలోల గంజాయిని పట్టుకున్నారు. దీని విలువ రూ.1,62,82,500 ఉంటుందని అధికారులు వెల్లడించారు.

సోడియం బైక్రోమేట్‌ పేరుతో పత్రాలు.... : లారీని తనిఖీ చేసిన అధికారులు సోడియం బైక్రోమేట్‌ పేరుతో ఇన్‌వాయిస్‌ ఉన్నట్లు గుర్తించారు. నర్సీపట్నం అడ్డరోడ్డులో గంజాయిని లారీలో లోడ్‌ చేశారు. అక్కడ నుంచి మహారాష్ట్రలోని వడోదరలో దిగుమతి చేసేలా పత్రాలు రూపొందించారు. గంజాయి ఉన్న సంచులను లారీలో సర్ధి దానిపై ఎవరికీ అనుమానం రాకుండా రెండు వరుసల్లో టార్పాలిన్‌ కప్పారు. డీఆర్‌ఐ అధికారులు టార్పాలిన్‌ తొలగించి చూడగా 500 సంచుల్లో ఉన్న గంజాయి బయటపడింది. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారిపై కేసు నమోదు చేశారు.