జగన్‌కు ఘన స్వాగతం


తరకటూరు (గూడూరు): వైకాపా అధినేత జగన్మోహనరెడ్డి చేపట్టిన పాదయాత్ర సోమవారం సాయంత్రం 5 గంటలకు గూడూరు మండల పరిధిలోని తరకటూరుకు చేరుకుంది. గ్రామం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు జగన్‌కు ఘనస్వాగతం పలికారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాదు, రాము, పలువురు నాయకులు తన అనుచరగణంతో కలిసి జగన్‌ను గజమాలతో సత్కరించి స్వాగతం పలికారు. అక్కడి నుంచి చిట్టిగూడూరు వరకు జగన్‌ పాదయాత్ర నిర్వహించారు. మండల పరిధిలోని ఆయాగ్రామాలతోపాటు వివిధ ప్రాంతాల నుంచి పెక్కుసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి యాత్రను అనుసరించారు. రహదారి పొడవునా కార్యకర్తలు పార్టీ జెండాలు చేతబూని పెద్దఎత్తున నినాదాలు చేశారు. మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. దారిపొడవునా ప్రజలను పలకరిస్తూ వారిని ఆశీర్వదిస్తూ జగన్‌ తన పాదయాత్రను కొనసాగించారు. పలువురు డప్పు కళాకారులు చేసిన వాద్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పెడన ఎంపీపీ రాజులపాటి అచ్యుతరావు, మున్సిపల్‌ ఛైర్మన్‌ బండారు ఆనందప్రసాదుతోపాటు గొరిపర్తి రవికుమార్‌, బొమ్ము బాబు, జక్కా అర్జున భాస్కరరావు తదితరులు జగన్‌కు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. వైకాపా నాయకులు వంగవీటి రాధాకృష్ణ, జోగి రమేష్‌, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్‌ తదితరులు యాత్రలో పాల్గొన్నారు. సాయంత్రం 6.15 గంటలకు చిట్టిగూడూరు వద్ద ఏర్పాటు చేసిన బసకు జగన్‌ చేరుకున్నారు.

పెడన సభ 5వ తేదీకి వాయిదా 
ఈనెల 2వ తేదీన పెడనలో నిర్వహించాల్సిన బహిరంగ సభ 5వ తేదీకి వాయిదా పడినట్లు ఉప్పాల రాంప్రసాదు ఒక ప్రకటలో తెలిపారు. ఆరోజు మధ్యాహ్నం 3 గంటలకు సభ జరుగుతుందని, నియోజకవర్గ నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు.

నేటి పర్యటన వివరాలు... 
మంగళవారం ఉదయం 7.30 గంటలకు చిట్టిగూడూరు నుంచి జగన్‌ పాదయాత్ర ప్రారంభం అవుతుందని నాయకులు తెలిపారు. అక్కడి నుంచి గూడూరు, రామరాజుపాలెంమీదుగా బందరు మండలంలోని సుల్తానగరంలోకి ప్రవేశిస్తుందన్నారు.