అవగాహనతోనే అంతం!


ఆంత్రాక్స్‌.. ఈ వ్యాధి పేరు వింటేనే గిరిజనులు, ఇతర మైదాన ప్రాంతవాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. విశాఖపట్నం జిల్లాలోని పాడేరు మన్యంలో అనేక మంది ఆంత్రాక్స్‌ బారిన పడిన విషయం తెలిసిందే. జిల్లాలో ఇంతవరకు ఆంత్రాక్స్‌ వ్యాధి లక్షణాలు ఏ ఒక్కరి వద్దా బయటపడలేదు. ఒక్క కేసు నమోదు కాలేదని వైద్యశాఖ వర్గాలు అంటున్నాయి. అలాగని వ్యాధి వ్యాపించదని చెప్పలేమని, ఎప్పుడైనా వ్యాపించవచ్చని అంటున్నారు. బ్యాక్టీరియా ద్వారా ఈవ్యాధి వ్యాపిస్తుందని.. అందువల్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే శ్రీరామరక్ష అని అంటున్నారు.

మూగజీవాల నుంచి వ్యాప్తి 
ఆవులు, మేకలు, గొర్రెల పాలు నుంచి, చర్మం నుంచి, ఊలు నుంచి ఆంత్రాక్స్‌ బ్యాక్టీరియా తయారవుతుంది. పశువులు, గొర్రెలు, మేకల కాపర్లకు ముందుగా వ్యాధి సోకే అవకాశాలు ఉన్నాయి. వ్యాధి సోకిన వారిని ముట్టుకున్నా, వారు వేసుకున్న దుస్తులు వేసుకున్నా వ్యాధి సోకుతుంది. మన ప్రాంతంలో ఎక్కువగా మూగజీవాలు ఉన్నాయి. ముఖ్యంగా పీవీటీజీ గ్రామాల్లో పలు కుటుంబాలకు ఎన్నో కొన్ని ఆవులు, మేకలు, గొర్రెలు ఉన్నాయి. ఇళ్లను ఆనుకునే పశువుల శాలలు ఉంటాయి. మరోవైపు ఉత్తరాంధ్రలోని విశాఖ జిల్లాలో ఈ వ్యాధి వ్యాప్తి చెందినా.. ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి మేపు నిమిత్తం గొర్రెలు, మేకలను తోలుకుని వెళ్లారు కాబట్టి పశువుల యజమానులు, కాపర్లు తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యాధికారులు చెబుతున్నారు.

రెండు రకాల వ్యాధి.. 
ఆంత్రాక్స్‌ వ్యాధి రెండు రకాలు. కిటేనియస్‌, విజరల్‌ రకాల వ్యాధి సోకుతుంది. పాడేరు ప్రాంతంలో వ్యాప్తి చెందింది కిటేనియస్‌ రకమైన ఆంత్రాక్స్‌ వ్యాధి. ఈ వ్యాధి సోకితే పాదాలు, చేతులపై నల్లని పుండ్ల మాదిరిగా వస్తాయి. అవి పగిలిపోయి చీము కారుతుంది. జ్వరం రావడం, వికారం, నీరసంగా ఉంటుంది. ఇక విజరల్‌ రకం శరీరం లోపలి భాగాలకు సోకుతుంది. ఆంత్రాక్స్‌ వ్యాధి లక్షణాలు కలిగిన రోగికి కారే చీమును పరీక్షల నిమిత్తం విశాఖపట్నలోని కేజీహెచ్‌కి పంపించాల్సి ఉంటుంది. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలకు సంబంధించి కేజీహెచ్‌లోనే ఈ పరీక్షా కేంద్రం ఉంది. గిరిజన ప్రాంతంలోని వైద్యాధికారులు తమ వద్దకు వచ్చే రోగులకు ఆంత్రాక్స్‌ వ్యాధి ఉందో లేదో పరీక్షించడం ద్వారా వ్యాధి మన ప్రాంతంలో ప్రబలకుండా చేయొచ్చని అధికారులు పేర్కొంటున్నారు.

అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది 
ఆంత్రాక్స్‌ వ్యాధి జిల్లాలోని మన్యం ప్రాంతంలో వ్యాప్తి చెందనప్పటికీ.. ఈ వ్యాధిపై గిరిజనులకు, ఇతరులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. మలేరియా, అతిసారం వ్యాధులకు సంబంధించి ఏ విధంగా తెలియజేస్తున్నారో అదే విధంగా దీనిపైనా చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర మంత్రి ఆనందబాబు స్వయంగా సూచనలు చేశారంటే వ్యాధి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. గ్రామాలకు వైద్య సిబ్బంది వెళ్లే సమయంలో వ్యాధి లక్షణాలు, ఎలా సోకుతుంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎక్కడ వైద్యం అందుతుంది, తదితర అంశాలపై చైతన్యం తీసుకురావాల్సిన కల్పించాల్సిన అవసరం ఉంది.

ఒక్క కేసు సైతం నమోద్‌ కాలేదు. 
జిల్లాలోని గిరిజన ప్రాంతంలో ఆంత్రాక్స్‌ వ్యాధికి సంబంధించి ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఆ లక్షణాలు ఇంతవరకు ఎక్కడా బయటపడలేదు. ఇన్నేళ్లలో ఈ వ్యాధి రానప్పటికి రాదని ఏమీ చెప్పలేం. అందుకే ముందుజాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఇటీవల గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఆనందబాబు వీడియో సమావేశంలో తగు సూచనలు చేశారు. జిల్లాలోని గిరిజన ప్రాంతంలో మలేరియా, అతిసారం వంటి వ్యాధులు వ్యాపిస్తున్నాయి. వైద్య సిబ్బంది ద్వారా మలేరియా, అతిసారంతో పాటు ఆంత్రాక్స్‌ గురించి గిరిజనులు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం.