తప్పు మీద తప్పు!


చేసిందే తప్పుల మీద తప్పులు... ఇపుడు వాటిని మాయ చేసే యత్నంలో మరో తప్పటడుగు..ఇదీ బయో మెడికల్‌ సంస్థ తీరు..నగరంలోని ప్రభుత్వాసుపత్రుల్లో వందలాది వైద్య పరికరాల నిర్వహణ పేరుతో భారీగా బిల్లులు పెట్టుకున్న ఆ సంస్థ.. ఇపుడు ఆ యంత్రాలను పాడైపోయినట్టుగా చూపించేందుకు తెగ తాపత్రయపడుతోంది. ఇందుకోసం రహస్యంగా బృందాలను పంపించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది.

వైద్య పరికరాల నిర్వహణ, మరమ్మతుల పేరుతో భారీ అక్రమాలకు పాల్పడ్డ బయో మెడికల్‌ సర్వీసెస్‌ సంస్థకు ఉన్నతాధికారులు, ఇతర యంత్రాంగం కొమ్ము కాస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఏ తప్పులైతే చేసి బిల్లుల ద్వారా ప్రతి నెలా రూ. కోట్లు కొల్లగొడుతున్న ఆ సంస్థ ఇప్పుడు ఆ తప్పుల్ని చెరిపేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఒక ప్రత్యేక బృందాలను విశాఖ పంపింది. పని చేయని యంత్రాలకు బిల్లులు పెట్టిన వాటిని గుర్తించి.. బయటికి తీసి.. తాజాగా పాడైపోయినట్టు బీఈఆర్‌ ట్యాగ్‌ (బియాండ్‌ ఎకనమిక్‌ రిపేర్‌)లను వేయిస్తోంది.

ఇప్పటికే వెయ్యికిపైగా యంత్రాలకు..: నగరంలో 6 ప్రధాన ఆసుపత్రుల్లో 1500కు పైగా పనికిరాని వైద్య యంత్రాలున్నాయి. అందులో 1045 యంత్రాలకు.. అవి పనిచేస్తున్నాయని చూపించి ఆ సంస్థ ప్రతి నలెఆ బిల్లులు పెట్టుకుంటోంది. ఈ వ్యవహారాన్ని ‘ఈనాడు’ వెలుగులోకి తేవడంతో ఆ కంపెనీ అప్రమత్తమైంది. ఉన్నతాధికారుల సహకారంతో నేరుగా బృందాల్ని విశాఖకు పంపింది. తాము చేసిన తప్పుల్ని ఏకకాలంగా చెరిపేసేందుకు పన్నాగం పన్నింది. బీ ఇలా ఆధారాలను చెరిపేసే క్రమంలో.. కేజీహెచ్‌లో 800కు పైగా పనిచేయని యంత్రాలున్నాయి. ఇవి తాజాగానే పాడయ్యాయంటూ నివేదికలు ఇచ్చి.. వీటిన్నింటికీ బీఈఆర్‌ ట్యాగ్‌లు వేయించింది. అంటే ఈ ట్యాగ్‌ వేస్తే ఇక ఆ యంత్రం స్క్రాప్‌కిందే లెక్క. బీ ఛాతీ, అంటువ్యాధుల ఆసుపత్రిలో 190 దాకా పరికరాలు పనిచేయనివి ఉన్నాయి. వీటిలో దాదాపు వంద యంత్రాలకు తాజాగా బీఈఆర్‌ ట్యాగ్‌లు వేయించింది. బీ  ప్రాంతీయ కంటి ఆసుపత్రిలో సుమారు 40 యంత్రాలకు తాజాగా ఈ ట్యాగ్‌లు వేయించింది. 
ఇపుడు ట్యాగ్‌లు వేసిన అన్నిటికీ గత మార్చి నెల వరకు ఆ సంస్థ పెట్టుకున్న బిల్లులు పెట్టుకోవటం గమనార్హం. ఇప్పుడు వీటన్నిటినీ తాజాగా బీఈఆర్‌ ట్యాగ్‌ వేశామని చూపించి, ఏప్రిల్‌ బిల్లు నుంచి అక్రమాల్ని కప్పి పెట్టేయాలనేది ఆ సంస్థ వ్యూహంగా కనిపిస్తోంది. 
విక్టోరియా, మానసిక, ఈఎన్‌టీ ఆసుపత్రులు, ఏఎంసీలో సైతం ఈ తరహా ప్రక్రియ కొనసాగుతోంది.

1990ల్లోని పరికరాలూ ఉన్నాయి..: ఒక యంత్రం మహా అంటే పదేళ్లపాటు నాణ్యమైన సేవలందిస్తుంది. ఇలాంటివాటిని గడువు దాటగానే స్క్రాప్‌ చేసేయాలి. కానీ 2015లో రంగంలోకి దిగిన ఆ బయోమెడికల్‌ సంస్థ ఆ పనిచేయలేదు. 1990ల్లో కొన్న పరికరాల దగ్గరనుంచి 2005 వరకు కొన్న వాటిల్లో చాలావరకు పాడైపోయాయి. ఇవన్నీ పాడయ్యాయని అధికారికంగా గుర్తించకుండా, పనిచేస్తున్నట్లు వాటికి ట్యాగ్‌ నెంబర్లు (ఐడీనెంబరు)ను ఇచ్చుకుంటూ వచ్చిందని విశ్వసనీయంగా అందిన సమాచారం. తాజాగా ఈ సంస్థ పెడుతున్న ప్రతిపాదనలను ఏపీఎంఐడీసీ విభాగం ఆమోదించడంతో పాటు జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌ (ఈ యంత్రాల నిర్వహణ ఖర్చులన్నీ ఈ నిధి నుంచే వస్తున్నాయి)కు చెందిన ఓ బయోమెడికల్‌ ఇంజినీర్‌ను విశాఖకు పంపించి వాటికి బీఈఆర్‌ట్యాగ్‌ పడేలా జాగ్రత్తలు తీసుకుంది.

జాబితాలూ తారుమారు..: 2015లో వచ్చిన బయో మెడికల్‌ సంస్థ వచ్చింది. ఆయా ఆసుపత్రుల్లో అధికారిక దస్త్రాల్లో వివిధ యంత్రాలను ఎప్పుడు కొన్నారు, వారంటీలో ఉన్నాయా లేవా అనే వివరాలన్నీ ఉన్నాయి. గత మార్చి నెల వరకు కేజీహెచ్‌లో వారంటీ కింద ఉన్న యంత్రాల్లోంచి 124 యంత్రాలకు తామే మరమ్మతులు చేస్తున్నట్టు బయో మెడికల్‌ సర్వీసెస్‌ బిల్లుల్లో చూపింది. తప్పుడు కొనుగోలు తేదీల్ని చూపించింది. ఇపుడు ఈ తప్పు కూడా బయటపడకుండా ఆసుపత్రిలో ఉన్న దస్త్రాలను మార్చేస్తోంది. పనిచేయని యంత్రాలకు సైతం బిల్లులు పెట్టుకోవడంతో... వాటిని కూడా తారుమారు చేసేందుకు నగరంలోని అన్ని ప్రధాన ఆసుపత్రుల దగ్గరనుంచి జాబితాల్ని సేకరించింది. వీటిని ఒక రహస్య ప్రదేశంలో తారుమారు చేసేందుకు యత్నిస్తోంది.