కాసుల రోగం.. కొలువుల బేరం


అనంత నగర పాలక సంస్థలో పని చేస్తున్న నాలుగో తరగతి ఉద్యోగి ఒకరు మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ కింద దరఖాస్తు చేసుకున్నారు. తనకు పక్షవాతం ఉందంటూ సర్వజనాస్పత్రి వైద్య మండలికి విన్నవించారు. కొంత సమస్య అయితే ఉంది. చికిత్సతో నయం అయ్యే అవకాశం ఉంది. కానీ.. రూ.5 లక్షలకు ఒప్పందం కుదిరింది. ఓ పీహెచ్‌సీలో పని చేస్తున్న జూనియర్‌ సహాయకుడే దళారీ. ఓ ప్రజాప్రతినిధి కూడా చెప్పారంటూ తెరపైకి తీసుకొచ్చారు.

అనంత నగర పాలక సంస్థలో ఆయనొక నాలుగో తరగతి ఉద్యోగి. ఇతనికి హెచ్‌ఐవీ ఉన్నట్లు తేలింది. ఇదే క్రమంలోనే వెన్నెముకలో విపరీతమైన నొప్పి వచ్చిందంట. ఇతనికి రెండు కాళ్లలో స్పర్శ లేదనీ... చికిత్సతో కూడా నయం అయ్యే పరిస్థితి లేదని వైద్యులు ధ్రువీకరించారు. ఇందుకు ఓ మధ్యవర్తి రూ.5 లక్షలు ముడుపులు తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం అదే ఉద్యోగి చికిత్స తర్వాత ఎంచక్కా నడుస్తున్నాడు. వైద్య మండలి ఇచ్చిన ధ్రువీకరణతో ఆయన కుమారుడికి ఉద్యోగం లభించింది. 
సర్వజనాస్పత్రిలో ఓ ఉద్యోగి పరిస్థితీ అంతే. ఇతని ఆరోగ్యం బాగుంది. కానీ.. ఊపిరితిత్తుల్లో తీవ్ర సమస్య ఉన్నట్లు దరఖాస్తు పెట్టుకున్నాడు. ఇతనితో రూ.6 లక్షలకు బేరం కుదిరింది. అడ్వాన్సుగా రూ.3 లక్షలు తీసుకున్నారు. వైద్య ధ్రువీకరణ ప్రక్రియ నడుస్తోంది. వైద్య కళాశాలలో పని చేస్తున్న పొరుగు సేవల ఉద్యోగి దళారీగా వ్యవహరిస్తున్నాడు.

న్యూస్‌టుడే, అనంతపురం (వైద్యం)

‘‘మెడికల్‌ ఇన్వాలిడేషన్‌... ఇదొక మాయాజాల వ్యవహారంగా మారింది. కొందరికి కాసుల పంట పండిస్తోంది. దళారుల ప్రవేశంతో వసూలు దందా సాగుతోంది. లేనిది ఉన్నట్లుగా నిర్ధరిస్తూ ముడుపుల బాగోతానికి తెర లేపారు. ఈ అవినీతి తంతు... కొంత కాలంగా పడగవిప్పింది. గతంలో రెండుమూడు నెలలకు ఒక కేసు వస్తే... ఇప్పుడు నెలకు సగటున నాలుగు కేసులు నమోదు అవుతుండటం ప్రస్తావనార్హం. దీన్నిబట్టి అవినీతి ఏ స్థాయికి పెరిగిందో స్పష్టమౌతోంది.’’

మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ అంటే... ఉద్యోగిగా ఉంటూ నిర్దేశిత ఏడు రకాల వ్యాధుల్లో ఏదొక దానితో సతమతం అవుతున్నట్లు వైద్య మండలి

ధ్రువీకరిస్తే చాలు.. తండ్రి ఉద్యోగం కుమారుడికి వచ్చేస్తుంది. 55 ఏళ్ల దాకా ఉద్యోగం చేసి... ఆఖరు ఐదేళ్లు ఉండగానే.. కుమారుడికి బదలాయింపు చేయడమే దీని ఉద్దేశంగా మారింది. అందుకే రూ.లక్షలు ముడుపులు ఇవ్వడానికి కూడా వెనుకాడటం లేదు. వీరి అత్యాశనే కొందరువైద్యులకు వరంగా మారింది. ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఇదొక దందాగా నిర్విఘ్నంగా నడుస్తోంది. నెలకు కనీసం రూ.20 లక్షలకుపైగా ముడుపుల పందేరం సాగుతోంది. మొత్తం వ్యవహారంలో ఇద్దరు కీలక వైద్యులే నడిపిస్తున్నారు. ఈ జాడ్యం అన్ని ప్రభుత్వ శాఖలకు పాకింది. ఇప్పుడున్న పరిస్థితిలో ప్రభుత్వ ఉద్యోగాలు రావడం కష్టం. అందుకే తండ్రి ఉద్యోగాలను కుమారులకు ఇప్పించేందుకు మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ ఒక వరంగా మారిందనే చెప్పాలి.

ఉండాల్సిన జబ్బులు ఏవంటే... 
మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ పొందాలంటే... ఏ జబ్బులు ఉండాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం 2008 అక్టోబరు 23న జీవో 661ను జారీ చేసింది. పక్షవాతం, క్యాన్సర్లు, ఊపిరితిత్తులు, నరాల బలహీనత, మానసిక జబ్బులు, వెన్నుముక, కాళ్లల్లో స్పర్శ లేకపోవడం... ఈ జబ్బులు వచ్చినా శాశ్వతంగా నయం కాకపోతేనే దీని కిందకు వస్తాయి. ఒకవేళ ఈ జబ్బులు సోకినా వైద్యచికిత్సతో నయం అయ్యే పరిస్థితి ఉంటే నిర్ధరణ ధ్రువీకరణ ఇవ్వడానికి లేదు. సదరు ఉద్యోగుల వినతిని నిర్దాక్షిణ్యంగా తిరస్కరించవచ్చు. ఈ అధికారం... సర్వజనాస్పత్రి వైద్య మండలికి ఉంది. వైద్య మండలి జారీ చేసిన ధ్రువీకరణ ఆధారంగా కలెక్టర్‌ సారథ్యంలో ఉండే కమిటీకి వెళ్తుంది. ఇందులో కలెక్టర్‌ ఛైర్మన్‌, డీఎంహెచ్‌వో సభ్యుడు... సంబంధిత శాఖ జిల్లా అధికారి కార్యదర్శిగా ఉంటారు. ఈ కమిటీ ఆమోదం తెలపగానే మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ కింద కుమారుడికి ఉద్యోగం ఇస్తారు. ఈ ప్రక్రియ ఇప్పుడు చాపకింద నీరులా జోరుగా విస్తరిస్తోంది.

ముడుపులిస్తే నెలకే ఉద్యోగం.. 
ఆరు నెలలుగా ఈ వ్యవహారం విచ్చలవిడిగా సాగుతోంది. గతంలో మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ అంటే చాలా కష్టంగా ఉండేది. ఇపుడు దళారుల పాచిక సులువుగా పారుతుండటంతో ఉద్యోగులు కూడా పదుల సంఖ్యలో వినతులు పెట్టుకున్నారు. ఆస్పత్రి వైద్య మండలి ధ్రువీకరణ ఇస్తే చాలు... కలెక్టర్‌ సారథ్యంలో ఉండే కమిటీ సాధారణంగానే ఉద్యోగం ఇచ్చేస్తుంది. అందుకే వైద్యమండలి కోసమే రూ.లక్షలు వెచ్చించేందుకు వెనుకాడటం లేదు. దళారుల పరిచయాల మేరకు ఒక్కో కేసుకు రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలు దాకా ధర పలుకుతోంది. ఈ వ్యవహారంలో ఇద్దరు సీనియర్‌ వైద్యులే కీలకం. వీరిద్దరూ అంగీకరిస్తే చాలు... దస్త్రం చకచక సాగిపోతుంది. ఓ సీనియర్‌ వైద్యుడు తరుచూ మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎం కార్యాలయం పేర్లను వాడుతూ దస్త్రాలను వేగంగా కదిలిస్తారు. అనవసరంగా మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ ఇవ్వడానికి కొన్ని శాఖల ప్రొఫెసర్లు తిరస్కరించిన దాఖలాలు ఉన్నాయి. వారిని సైతం బుజ్జిగించేస్తున్నారు. ‘రాజకీయ’ సిఫార్సుల పేరుతో వారిని పరోక్షంగా బెదిరిస్తూ పబ్బం గడుపుకొంటున్నారు. ఈ వ్యవహారం ఇటీవల ఎక్కువైంది. ఇప్పటి దాకా జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలపై విజిలెన్స్‌ శాఖ లోతుగా దర్యాప్తు చేపడితే ఆశ్చర్యపడే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంది.

దళారులను నమ్మవద్దు 
- డాక్టర్‌ జగన్నాథ్‌, వైద్య పర్యవేక్షకుడు, సర్వజనాస్పత్రి 
మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే సాగుతుంది. ఇందులో ఎలాంటి అవకతవకలు ఉండవు. ముడుపుల వ్యవహారం అసలు ఉండదు. కానీ కొందరు దళారులు వసూలు దందాకు దిగినట్లు తెలుస్తోంది. ఇలాంటి వారిని అసలు నమ్మవద్దు. పద్ధతి ప్రకారమే ఈ ప్రక్రియ సాగుతుంది.