కాలుష్యం కాటు


స్వచ్ఛమైన గాలిలో ఉండే ఆక్సిజనే మనిషికి ప్రాణవాయువు. మరి అదే లోపిస్తే మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. అలాంటి పరిస్థితే పిడుగురాళ్లలో నెలకొంది. పిల్లుట్ల రోడ్డులోని సుమారు 300 సున్నపు బట్టీలు వినియోగంలో ఉన్నప్పుడు భారీస్థాయిలో విషవాయువులు వెలువడేయి. కాలక్రమేణా సున్నానికి గిరాకీ లేకపోవడం, వ్యాపారంలో ఖర్చులు పెరిగి రాబడి తగ్గడంతో చాలా మంది వాటిని కాల్చకుండా అలాగే వదిలేయగా ప్రస్తుతం వంద మాత్రం రాత్రింబవళ్లు మండుతూనే ఉంటున్నాయి. వీటిల్లో ముడి సున్నపురాయిని కాల్చటానికి 30 శాతం బొగ్గు, 70 శాతం పెట్రో బొగ్గు వినియోగిస్తుండగా  భారీగా విషవాయువులు వెలువడుతున్నాయని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు.

పెట్రో కోక్‌తో అత్యధిక కాలుష్యం 
సున్నపు బట్టీల్లో వినియోగించే మామూలు బొగ్గువల్ల అంత ఎక్కువ విషవాయువులు వెలువడవు. పెట్రో కోక్‌ మండితే సల్ఫర్‌, సల్ఫర్‌ డయాక్సైడ్‌, కార్బన్‌ డయాక్సైడ్‌ అత్యధికంగా వెలువడతాయి. వీటితోపాటు.కార్బన్‌ మోనాక్సైడ్‌, మిథేన్‌, నైట్రోజన్‌ ఆక్సైడ్‌వంటి విషవాయువులు ఎక్కువగా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. తద్వారా దాదాపుగా అణువులు 65 వేల నుంచి 75 వేల వరకు పీపీఎంగా నమోదవుతాయి. అదే సహజ బొగ్గును మండిస్తే 4000 పీపీఎం నమోదవుతుంది. ఇటీవల కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ పెట్రో కోక్‌ దిగుమతులపై కోత విధించబోతున్నట్లు ప్రకటించారు. దిల్లీ పరిసర ప్రాంతాల్లో కాలుష్యం అత్యధికస్థాయిలో వస్తుండటంతో దీని వినియోగాన్ని నిషేధించారు.

పొగ గొట్టాలు ఏవీ? 
బట్టీల నుంచి వెలువడే దుమ్ము, ధూళితో కూడిన పొగ వాతావరణంలో కలిసిపోకుండా నివారించే గొట్టం ఏర్పాటు చేయలాంటే రూ.ఆరేడు లక్షలపైనే ఖర్చవుతుంది. దాంతో ఇక్కడ ఉన్న సుమారు 300ల్లో కనీసం 20కి కూడా వాటి ఏర్పాటు జరుగలేదు. అందుకు కారణం ఏమిటంటే.. బట్టీల్లో ముడిరాయిని వేయటానికి వాటి పైకి ఎక్కే కార్మికులకు ఆ పని కనీసం రెండు గంటలు పడుతుంది. అదే గొట్టం ఉంటే దాని నుంచి వచ్చే పొగ అక్కడే చూరుకొని వారు ఎక్కువసేపు నిలబడలేరు. దాంతో గొట్టాలు ఏర్పాటు చేసినా వాటిని వినియోగించటం లేదు.

కళ్లు మండిపోవాల్సిందే.. 
పట్టణంలోని సున్నపు బట్టీల ప్రాంతానికి వెళితే బట్టీల నుంచి వెలువడే దుమ్ము, ధూళి, ఇతర విషవాయువులు భారీగా వ్యాపిస్తుంటాయి. వీటివల్ల ఆ ప్రాంతంలో ఉన్న వారి, అక్కడకు వెెళ్లిన వారి కళ్లు ఎర్రగా మారి, మండిపోతుంటాయి. కొందరికైతేే తల తిరిగినట్లు ఉంటుంది. చర్మ, శ్యాసకోస వ్యాధుల బారినపడుతున్నారు. గర్భిణులకు గర్భస్రావం కావటం, తక్కువ వయస్సులో బాలికలు పుష్పవతులు కావటం జరుగుతోంది. మారుతీ నగర్‌, లెనిన్‌ నగర్‌, ఇందిరమ్మ కాలనీ, చండ్రపాలెం, ఆదర్శ నగర్‌ కాలనీ, స్వర్ణ పిచ్చయ్య కాలనీ, పాతిగుంతల ప్రాంతాలు బట్టీలకు సమీపంలోనే ఉండగా ఆయా ప్రాంతాల్లో పది వేల మంది జనాభా నివసిస్తున్నారు. వీరందరూ ఈ కాలుష్యం బారిన పడుతున్నారు. పిడుగురాళ్ల ప్రాథ]మిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 96 మందికి, పట్టణంలోనే 62 మందికి, బట్టీల ప్రాంతంలో నివసించే 15 మందికి క్షయ వ్యాధి ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల నివేదికల్లో తేల్చారు. బట్టీల నుంచే వచ్చే దుమ్ము, ధూళీ, విషవాయువుల కారణంగానే ఇది ప్రబలుతోందని వైద్యులు చెబుతున్నారు. బట్టీలు వంద ఎకరాల విస్తీర్ణంలో ఉండగా ఎక్కడా రోడ్డు నిర్మాణాలు లేవు. వాహనాల రాకపోకల సమయంలో పెద్ద ఎత్తున దుమ్ము, ధూళీ ఎగసి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. ఇంత భారీస్థాయిలో రేణువులు వస్తున్నా కాలుష్య నియంత్రణ అధికారులు కనీసం మొక్కల పెంపుదల చేయకపోవటం గమనార్హం. కనీసం రెండు మూడేళ్లకు కూడా వారు తనిఖీలకు రావటం లేదు. తమ ఆరోగ్యానికి చేటు కలుగుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని పురప్రజలు విమర్శిస్తున్నారు. ప్రతి బట్టీకి పొగ గొట్టం ఏర్పాటు చేయించి కాలుష్యాన్ని నియంత్రణ చేయాలని పురపాలక సంఘం అధికారులనూ కోరుతున్నారు.

విషవాయువులు వెలువడతాయి 
ముడిరాయిని కాల్చటానికి బట్టీల్లో బొగ్గును వినియోగిస్తారు. అది మండితే అనేక విషవాయువులు వెలువడతాయి. ప్రధానంగా కార్బన్‌, సల్ఫర్‌ డయాక్సైడ్లు, కార్బన్‌ మైనాక్సైడ్‌, నైట్రోజన్‌ ఆక్సైడ్‌, మిథేన్‌ వాయువులు, మెటల్‌ రేణువులు గాలిలో కలుస్తాయి. కార్బన్‌ మోనాక్సైడ్‌, కార్బన్‌ డయాక్సైడ్‌వల్ల ఆస్తమా, శ్యాసకోశ వ్యాధులు వస్తాయి. పెద్దల్లో గుండె నాళాలపై ప్రభావం చూపుతుంది. పిల్లల్లో ఎలర్జీలు ఎక్కువగా వస్తాయి. గర్భిణులకు పుట్టే పిల్లలకు గుండె, శ్యాసకోశ వ్యాధులు వస్తాయి. తక్కువ వయస్సులో ఆడపిల్లలు పుష్పవతులు అవుతారు. గర్భస్రావాలు అవుతాయి. సల్ఫర్‌ డయాక్సైడ్‌ గాలిలో కలిసినప్పుడు వాతావరణంలో ఉన్న నీటి బిందువులతో కలిసి ఆమ్ల వర్షాలు కురుస్తాయి. వాటి నుంచి ధూళివల్ల క్షయ వ్యాధి వస్తుంది.