చెన్నై సూపర్‌ కింగ్స్‌ @100


పుణె: ఐపీఎల్‌లో మహేంద్ర సింగ్‌ ధోనీ నాయకత్వం వహిస్తోన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు అరుదైన ఘనతను అందుకుంది. అత్యధిక టీ20లు గెలిచిన జట్ల జాబితాలో చెన్నై సూపర్‌కింగ్స్‌ రెండో స్థానంలో నిలిచింది. ఐపీఎల్‌ 11వ సీజన్‌లో భాగంగా సోమవారం దిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయంతో చెన్నై ఈ ఘనత సాధించింది.

ఇప్పటి వరకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ 100 విజయాలు నమోదు చేసింది. ఇవన్నీ మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోనే కావడం విశేషం. అత్యధిక టీ20 మ్యాచ్‌లు గెలిచిన జట్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నది ఎవరో తెలుసా... ఇంకెవరు మూడు సార్లు ఐపీఎల్‌ ట్రోఫీని ముద్దాడిన ముంబయి ఇండియన్స్‌. ఇప్పటి వరకు ముంబయి ఇండియన్స్‌ 186 మ్యాచ్‌లు ఆడగా అందులో 104 విజయాలను నమోదు చేసుకుని అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌ ప్రారంభానికి ముందు 94 విజయాలతో మూడో స్థానంలో ఉన్న చెన్నై 6 విజయాలు నమోదు చేసుకుని శతక విజయాలతో రెండో స్థానంలోకి దూసుకెళ్లింది. చెన్నై సూపర్‌కింగ్స్‌ మొత్తం 166(ఛాంపియన్స్‌ లీగ్‌తో కలిపి) మ్యాచ్‌లు ఆడగా 100 విజయాలు నమోదు చేసుకుంది. ఐపీఎల్‌లో చెన్నై అత్యధిక విజయాలను రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు పైనే సాధించింది. 12 సార్లు చెన్నై.. ఆర్‌సీబీపై గెలిచింది.

గత రెండేళ్ల పాటు నిషేధం కారణంగా ఐపీఎల్‌కు దూరమైంది చెన్నై. ఇదే జరగకుండా ఉంటే ధోనీ నాయకత్వంలోని చెన్నై జట్టు ఈ జాబితాలో ఎప్పుడో అగ్రస్థానాన్ని దక్కించుకునేది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. మరో పక్క మొదటి స్థానంలో ఉన్న ముంబయి ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడి కేవలం రెండు విజయాలనే నమోదు చేసుకుంది. మరో ఐపీఎల్‌ జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఏడో స్థానంలో కొనసాగుతోంది.