ఒకటో నంబరు కుర్రోడి జెర్సీ కథ


ముంబయి: ఆటగాళ్లు ధరించే జెర్సీల వెనుక ఉండే నంబర్లకు ఓ ప్రత్యేకత ఉంటుంది. పుట్టిన రోజు తేదీ, కలిసొచ్చే అంకెను వారు తమ జెర్సీల వెనుక ఉండేలా చూసుకుంటారు. తాజాగా ముంబయి ఇండియన్స్‌ ఆటగాళ్లు మయాంక్‌ మార్కండే, రాహుల్‌ చాహార్‌, తజీందర్‌ సింగ్‌ తమ జెర్సీ నంబర్ల వెనుక ఉన్న కథేంటో చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబయి ఇండియన్స్‌ నిర్వాహకులు ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు.

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో మయాంక్‌ మార్కండే బాగా రాణిస్తున్నాడు. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 10 వికెట్లు దక్కించుకుని మధ్యలో పర్పుల్‌ క్యాప్‌ను అందుకున్న సంగతి తెలిసిందే. మయాంక్‌ ధరించే జెర్సీ నంబర్‌ 11. ఈ నంబరే ఎందుకంటే ఇది నేను పుట్టిన తేదీ అంటున్నాడు. 1997 నవంబరు 11న మయాంక్‌ జన్మించాడు. అందుకే 11వ నంబర్‌ జెర్సీని ఎంచుకున్నాడు. అలాగే మరో ఆటగాడు రాహుల్‌ చాహర్‌ది ఒకటో నంబర్‌ జెర్సీ. ఒకటి తన లక్కీ నంబర్‌ అట. అందుకే అదే నంబర్‌ జెర్సీని ధరిస్తానని చెప్పాడు. తజీందర్‌ సింగ్‌ ధరించేదేమో 19వ నంబర్‌. ఎందుకు అని అడగ్గా... ఇంగ్లిష్‌లో ‘ఎస్‌’ 19వ అక్షరం. నా తల్లి పేరు సర్బజీత్‌ కౌర్‌, కోచ్‌ పేరు సుమీందర్‌ సింగ్‌. మీ అందరికీ తెలిసిన నా దేవుడు సచిన్‌ తెందుల్కర్‌. వీరందరి పేరు ‘ఎస్‌’తోనే ప్రారంభం అవుతోంది కదా. అందుకే 19 నా జెర్సీ నంబర్‌ అయ్యింది అని చెప్పాడు తజీందర్‌.

రాహుల్‌ చాహార్‌, తజీందర్‌ సింగ్‌ ఇప్పటి వరకు ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌లో ఇంకా ఆడలేదు. ముంబయి ఇండియన్స్‌ ఆడే మిగతా మ్యాచ్‌ల్లోనైనా వీరికి అవకాశం దక్కాలని ఆశిద్దాం!