‘చౌకీదార్’‌ పేదవారికి కాదు: రాహుల్‌


పట్నా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. చౌకీదార్‌ (కాపలాదారుడు)గా ఉంటున్నది పేదవారికి కాదని, ధనవంతులకేనని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శలు గుప్పించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బిహార్‌లోని పూర్ణియాలో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలా హామీలు ఇచ్చారు. కానీ, వాటిల్లో ఏవీ అమలు చేయలేదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే మేము కనీస ఆదాయ భరోసాను ఇస్తాము. నేను ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతున్నాను. మధ్యప్రదేశ్‌, ఛత్తీసగఢ్‌లో రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చాను.. దాన్ని అమలు చేశాము. ఎన్డీఏ ప్రభుత్వం.. నీరవ్‌ మోదీ, అనిల్‌ అంబానీ వంటి వారికి డబ్బులు ఇచ్చింది. మేము మాత్రం రైతులకు, కూలీలకు ఇస్తాం. చాలా మంది పారిశ్రామికవేత్తలకు చెందిన రుణాలను మోదీ మాఫీ చేశారు. కానీ, రైతు రుణమాఫీ మాత్రం చేయలేదు’ అని వ్యాఖ్యానించారు.

‘హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌కు రక్షణ రంగ ఒప్పందం (రఫేల్‌) దక్కకుండా చేసి, ఆ ఒప్పందాన్ని రక్షణ రంగంలో ఎటువంటి అనుభవం లేని పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీకి ఇచ్చారు. ఆయనకే మోదీ చౌకీదార్‌గా పనిచేస్తున్నారు. పేద ప్రజలకు రక్షణగా చౌకీదార్లు లేరు. ఈ చౌకీదార్లు అంతా ధనవంతుల కోసమే పనిచేస్తున్నారు. చాలా మంది ఆర్థిక నేరస్తులు దేశం నుంచి తప్పించుకుని పారిపోయారు. ఇటువంటి ఘటనలను మనం చూస్తూనే ఉన్నాం. ఇంకా ఎన్నాళ్లు చూడాలి? భావజాలాలకు సంబంధించిన పోరాటం జరుగుతోంది. మనకు రెండు రకాల భావజాలాలు ఉన్న భారత్‌ అవసరం లేదు. అందరిని కలుపుకుని అభివృద్ధి చెందే వ్యవస్థను మేము తీసుకొస్తాం. దేశాన్ని ధనవంతుల వర్గం, పేదవారి వర్గంగా విడగొట్టాలని మోదీ ప్రయత్నిస్తున్నారు. సాధారణ ప్రజలను మోదీ మిత్రులారా అని పిలుస్తారు. కానీ, అనిల్‌ అంబానీ, మెహుల్‌ చోక్సీ, నీరవ్‌ మోదీలాంటి వారిని మాత్రం సోదరులారా అని పిలుస్తారు’ అని రాహుల్‌ గాంధీ ఆరోపించారు.