మంగళగిరి బరిలో జనసేన


మంగళగిరి బరి రసవత్తరంగా మారింది. తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పోటీ చేస్తున్న ఈ స్థానంలో జనసేన కూడా రంగంలోకి దిగింది. నామినేషన్ల దాఖలుకు చివరిరోజు ఈ అనూహ్య నిర్ణయం తీసుకుంది. పొత్తుల్లో భాగంగా సీపీఐకి కేటాయించిన మంగళగిరి స్థానంలో పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. దీంతో జనసేన తరఫున చల్లపల్లి శ్రీనివాస్‌ నామినేషన్‌ వేయనున్నారు. ఇప్పటికే ఈ స్థానంలో తెదేపా తరఫున నారా లోకేశ్‌, వైకాపా తరఫున ఆళ్ల రామకృష్ణారెడ్డి బరిలో నిలిచారు.

జనసేన పార్టీ.. వామపక్షాలు, బీఎస్పీతో పొత్తు పెట్టుకుని ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పొత్తుల్లో భాగంగా ఏడు అసెంబ్లీతో పాటు, రెండు పార్లమెంట్‌ స్థానాలను సీపీఐకి కేటాయించింది. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాలో కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చడంపై సీపీఐ నేతలు అసంతృప్తికి గురయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ నేతలు జనసేనతో చర్చలు జరిపి సర్దుబాటు చేసుకున్నారు.

తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరి స్థానంలోనూ సీపీఐకి జనసేన ఝలక్‌ ఇచ్చింది. సీపీఐ తరఫున ముప్పాళ్ల నాగేశ్వరరావు నామినేషన్‌ వేసేందుకు సిద్ధమవుతుండగా.. చల్లపల్లి శ్రీనివాస్‌ను జనసేన ప్రకటించింది. బీ-ఫారాన్ని ఆదివారం అర్ధరాత్రి అందజేసింది. దీంతో శ్రీనివాస్ నామినేషన్‌ వేసేందుకు సిద్ధమయ్యారు. స్థానికంగా ఉన్న జనసేన నేతలను సంతృప్తి పరిచేందుకు, స్థానికంగా ఉన్న పార్టీ కేడర్‌ను కాపాడుకునేందుకు జనసేన అధ్యక్షుడు పవన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జనసేన నిర్ణయం పట్ల సీపీఐ అసంతృప్తి వ్యక్తంచేస్తోంది.