ఏపీపై పెత్తనమా?


ఆంధ్రప్రదేశ్‌ను నష్టపర్చడం ద్వారా రాష్ట్రంపై పెత్తనం చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ చూస్తున్నారని సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ర్టానికి కీలకమైన ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలని పార్టీ కేడర్‌కు సూచించారు. శుక్రవారం ఉదయం తన నివాసం నుంచి టీడీపీ అభ్యర్థులు, పార్టీనేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ‘రాష్ట్ర రాజకీయాల్లో టీఆర్‌ఎస్‌ నేతల జోక్యం పెరుగుతోంది. వైసీపీని కేసీఆర్‌ డమ్మీ చేశారు. మనకు నష్టం చేయడం ద్వారా కేసీఆర్‌ బలపడి ఏపీపై పెత్తనం చేయాలని చూస్తున్నారు. ఏపీలో కేసీఆర్‌కు ఓటేస్తామా? నేరుగా ఏపీలో ఓట్లు రావనే జగన్‌ ద్వారా కేసీఆర్‌ జగన్నాటకం ఆడుతున్నారు. జగన్‌ పార్టీ ద్వారా ఏపీపై పెత్తనం చెలాయించాలని కుట్ర చేస్తున్నారు. ఏపీని చెప్పుచేతల్లో ఉంచుకునేందుకే జగన్‌కు టీఆర్‌ఎస్‌ నేతలు మద్దతు పలుకుతున్నారు. వైసీపీకి ఓటేస్తే, టీఆర్‌ఎ్‌సకు పడినట్లే’ అని స్పష్టం చేశారు. కేంద్ర సంస్థల ద్వారా దాడులు చేసి ప్రత్యర్థులను బలహీనపరిచేందుకు బీజేపీ కుతంత్రాలకు పాల్పడుతోందన్నారు. వైఎస్‌ వివేకా హత్య కేసులో జగన్‌ అనుచరులపైనే ఆరోపణలున్నాయన్నారు. సాక్ష్యాలను తారుమారు చేసే వాళ్లు, అలాంటి పార్టీ ఆంధ్రప్రదేశ్‌కు అవసరమా? అని ప్రశ్నించారు.