శ్రీదేవి సినిమా.. పరిశీలనలో 3 టైటిళ్లు!


ముంబయి: దివంగత నటి శ్రీదేవి జీవితాధారంగా ఓ సినిమాను తెరకెక్కించాలని ఆమె భర్త, నిర్మాత బోనీ కపూర్ అనుకుంటున్నట్లు గతంలో వార్తలు వెలువడ్డాయి. అయితే శ్రీదేవి బయోపిక్‌గా కాకుండా ఆమె జీవితాన్ని ఓ లఘుచిత్రంగా తీయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ లఘు చిత్రానికి బోనీ మూడు టైటిళ్లు ఖరారు చేసినట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం.

వాటిలో ‘శ్రీ’, ‘శ్రీదేవి’, ‘శ్రీదేవి మ్యామ్‌’ టైటిళ్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ‘శ్రీదేవి జీవితాధారంగా ఓ సినిమాను తీయాలని బోనీ దృఢంగా నిర్ణయించుకున్నారు. ఇందుకోసమే ఆయన మూడు టైటిళ్లను రిజిస్టర్‌ చేయించుకున్నారు. ఇవే కాకుండా చాల్‌బాజ్‌, రూప్‌ కీ రాణీ చోరోంకా రాజా, జాన్‌బాజ్‌, మిస్టర్‌ ఇండియా, రిటర్న్‌ ఆఫ్‌ మిస్టర్‌ ఇండియా టైటిళ్లు కూడా పరిశీలిస్తున్నారు’ అని సినీ వర్గాలు వెల్లడించాయి.

ఫిబ్రవరి 24న దుబాయ్‌లోని ఓ హోటల్‌లో శ్రీదేవి ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో పడి మరణించిన సంగతి తెలిసిందే. ఆమె ఈ లోకంలో లేరన్న నిజాన్ని ఇంకా బోనీ కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. శ్రీదేవి చనిపోయిన కొన్ని రోజుల తర్వాత ఆమె జీవితాధారంగా లఘు చిత్రాన్ని తెరకెక్కిస్తానని బోనీ బాలీవుడ్‌ మీడియాతో అన్నారట. అయితే ఇది సాధారణ బయోపిక్‌లలా తెరకెక్కించడంలేదని బోనీ సన్నిహితులు చెబుతున్నారు. ఆమె రొటీన్‌ జీవితాన్ని కాకుండా ప్రేక్షకులకు తెలీని విషయాలతో ఈ లఘు చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట.