తెలుగు రాష్ట్రాల్లో నగదు కొరతకు ఇదే ప్రధాన కారణం


హైదరాబాద్‌ : నోట్ల రద్దు తర్వాత కొత్తగా వచ్చిన రూ.2వేల నోట్లు తిరిగి నల్లబజారుకు చేరినట్లు రిజర్వు బ్యాంకు అనుమానిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నగదు కొరత తీవ్రం కావడానికి ఇదే ప్రధాన కారణంగా భావిస్తోంది. నోట్ల రద్దుకు ముందు.. తర్వాత బ్యాంకు ఖాతాల్లో జరిగిన లావాదేవీలపై ఆర్‌బీఐ అధికారులు ఆరా తీస్తున్నారు.

నోట్ల రద్దు తర్వాత దేశ వ్యాప్తంగా ఉత్పన్నమైన నగదు కొరత తాత్కాలికమేనని ప్రజలు భావించారు. కొత్త నోట్ల ముద్రణతో ఈ కొరత తీరుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు రిజర్వుబ్యాంకు కూడా చెబుతూ వచ్చింది. నగదు కొరత సమయంలో దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్‌ లావాదేవీలపై విస్తృతంగా ప్రచారం కల్పించి.. ఆ దిశగా ప్రోత్సహించాయి. పట్టణ, నగరాల్లోని విద్యావంతులైన ఖాతాదారులు సింహాభాగం డిజిటల్‌ లావాదేవీలతోనే తమ రోజూవారీ అవసరాలను తీర్చుకోవడం అలవర్చుకున్నారు. ఇప్పటికీ అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు. డబ్బు ఆధారంగా లావాదేవీలు జరిగే గ్రామాల్లో మాత్రం నగదు కొరత తీవ్రంగా వేధిస్తోంది. కొత్త నోట్ల ముద్రణతో నగదు కొరత తీరిపోతుందని ప్రజలు, అధికారులు భావించారు. అయితే అలా జరగడం లేదు.