సినిమాలు తీసేది సమాజాన్ని ఉద్ధరించడానికి కాదు!


‘‘మా అందరికీ ఇదో ప్రత్యేకమైన చిత్రం. నాకు ఓ మైలు రాయి. విమర్శకుల ప్రశంసలు,  బాక్సాఫీసు వసూళ్లూ వేర్వేరు అనేది జనాల నమ్మకం. రెండింటినీ ఒకేసారి దక్కించుకోవచ్చని ‘భరత్‌..’ నిరూపించింది. అన్ని రంగాల నుంచి, అన్ని తరగతుల నుంచీ ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. రాజకీయ ప్రముఖులు కూడా మెచ్చుకున్నారు. కేటీఆర్‌, జయప్రకాష్‌ నారాయణ్‌ ఈ సినిమా చూసి ప్రశంసించడం  ఆనందాన్ని కలిగించింది’’

‘‘స్థానిక స్వపరిపాలన అనే అంశంపై ‘భరత్‌..’లో చర్చించాం. కేవలం ఈ అంశంతోనే ఓ సినిమా తీయొచ్చు. అంత పెద్ద సబ్జెక్ట్‌ ఇది. మనం రోజూ మన ఇళ్లల్లో కొన్ని సామాజిక విషయాలు మాట్లాడుకొంటుంటాం. ‘మార్పు రావాలి’ అనే బలమైన కాంక్ష మనందరిలోనూ ఉంది. ‘భరత్‌’ కూడా అదే ప్రతిబింబించింది. ఏ ఒక్క రాజకీయ నాయకుడినో దృష్టిలో ఉంచుకుని నేనీ కథ రాయలేదు. రాజకీయనాయకుల్లోని మంచిని తీసుకుని నా కథానాయకుడి పాత్రకి అన్వయించాను. ప్రస్తుత రాజకీయాలపై, నేతలపై సెటైర్లు వేసి, కొంతమందిని గుచ్చి.. వివాదం సృష్టించాలన్న ఆలోచన నాకెప్పుడూ లేదు. ఎవరి మనసు నొప్పించకుండా ఈ సినిమా తీయగలిగాం’’

‘‘మహేష్‌ లాంటి కథానాయకుడు అనుకుంటే.. ఫార్ములా కథల్ని పట్టుకుని హిట్లు, సూపర్‌ హిట్లూ కొట్టేయొచ్చు. కానీ ఆయనకు సవాళ్లు ఇష్టం. అందుకే ప్రయోగాలు చేస్తుంటారు. జయాపజయాలకు అతీతంగా ఆ ప్రయాణాన్ని, తన పాత్రనీ ఆస్వాదించే గొప్ప లక్షణం మహేష్‌లో ఉంది. బాలీవుడ్‌లో సినిమా చేయమని అడుగుతున్నారు. ‘మిర్చి’ దగ్గర నుంచే అక్కడి నుంచి అవకాశాలు వస్తున్నాయి. కానీ నాకు తెలుగు ప్రేక్షకుల నాడి తెలుసు. ఇక్కడి భావోద్వేగాలు తెలుసు. ఇవన్నీ వదిలి అక్కడకు వెళ్లడం ఇష్టం లేదు. నా అయిదో చిత్రం గురించి ఇంకా ఏమీ ఆలోచించలేదు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని అప్పుడు ఆ సినిమా పనులు మొదలెడతా. ఈసారి ఎలాంటి సందేశాల జోలికీ వెళ్లకుండా పూర్తి కమర్షియల్‌ చిత్రం తీయాలని ఉంది’’