
ఎస్సీ, ఎస్ట్టీల ఆత్మగౌరవాన్ని పెంచేందుకు కృషి
నకిరేకల్, న్యూస్‌టుడే: ఎస్సీ, ఎస్టీల ఆత్మగౌరవాన్ని పెంచేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం రాత్రి నకిరేకల్ ప్రధాన కూడలిలో నిర్వహించిన పౌరహక్కుల దినోత్సవ సభలో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీల సమస్యలను అక్కడిక్కడే పరిష్కరించేందుకు ప్రతి నెలా 30న అన్ని మండలాల్లో ‘పౌరహక్కుల దినోత్సవాలు’ నిర్వహించాలని తాజాగా జిల్లా యంత్రాంగాలకు ఆదేశాలిచ్చినట్లు వెల్లడించారు. ఇలాంటి దినోత్సవాలు నిర్వహించి గ్రామస్థాయిల్లోనే ఎస్సీ, ఎస్టీల సమస్యలు పరిష్కరించాలనే నిర్ణయం ఉన్నా గత పాలకులు పట్టించుకోలేదన్నారు. కమిషన్ ఛైర్మన్‌తో పాటు సభ్యులు, అధికారుల పదవులన్నింటినీ ఆంధ్రా ప్రాంతం వారితోనే భర్తీ చేసేవారన్నారు. ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలన్న బీఆర్ అంబేడ్కర్ ఆశయాలను సాధించేందుకు సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంలో సడలింపులపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేంత వరకు ఉద్యమించాలన్నారు. ఎమ్మెల్యే వేముల వీరేశం అధ్యక్షతన నిర్వహించిన ఈ సభలో కమిషన్ సభ్యులు విద్యాసాగర్, దేవయ్య, జిల్లా కలెక్టర్ గౌరవ్‌ఉప్పల్, నల్గొండ ఆర్డీవో వెంకటాచారి, జడ్పీటీసీ సభ్యులు పెండెం ధనలక్ష్మి, శేపూరి రవీందర్, ఎంపీపీలు రెగట్టే మల్లికార్జున్‌రెడ్డి, గుత్తా మంజుల, మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు మొగిలి సుజాత, ఉపసర్పంచి మంగినపల్లి రాజు, పూజర్ల శంభయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సాంస్కృతి సారథి కళాకారుల పాటలు అలరించాయి.
ఘనస్వాగతం
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కమిషన్ సభ్యులు తొలిసారిగా నకిరేకల్ వచ్చినందుకు వారికి ఎమ్మెల్యే వేముల వీరేశం, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో టీఎమ్మార్పీఎస్ నాయకులు చెరుకు వెంకటాద్రిమాదిగ, నకిరేకంటి అంజయ్యమాదిగ, ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రతినిధి మాచర్ల సైదులుమాదిగ, బీఎస్పీ నాయకుడు కాశీరాం, తెరాస నాయకులు పల్రెడ్డి నర్సింహారెడ్డి, కొండ వెంకన్న, నకిరేకంటి నరేందర్, రైసస సమన్వయకర్త బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
నల్గొండ సంక్షేమం: వసతిగృహాల్లో విద్యార్థినులకు నిర్దేశించిన ప్రకారం మెనూ అమలుచేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోల్ల శ్రీనివాస్ తెలిపారు. నల్గొండలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహాలను సోమవారం తనిఖీ చేశారు. నిర్వాహకులు మెనూ పాటించటం లేదని, గ్రంథాలయ వసతులు లేవని ఛైర్మన్ దృష్టికి విద్యార్థినులు తీసుకొచ్చారు. అంతకుముందు ఛైర్మన్‌ను ఆర్అండ్బీ అతిథిగృహంలో కలెక్టర్ గౌరవ్‌ఉప్పల్, దళిత సంఘాల నాయకులు సత్కరించారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు విద్యాసాగర్, అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, గ్రంథాలయ ఛైర్మన్ రేఖల భద్రాద్రి, ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ జగన్నాథరావు, ఎస్సీ సంక్షేమశాఖాధికారి సరోత్తమ్‌రెడ్డి, ఆర్డీఓ వెంకటాచారి, తహసీల్దారు నాగార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
