హంస వాహనంపై శ్రీస్వామి నదీవిహారం


మఠంపల్లి, న్యూస్‌టుడే: మట్టపల్లిలో నాలుగు రోజులుగా నిర్వహిస్తోన్న బ్రహ్మోత్సవాల్లో సోమవారం లక్ష్మీనృసింహుడు హంస వాహనంపై నదీవిహారం చేశాడు. విద్యుత్తోరణాలతో హంస ఆకృతిలో శోభాయమానంగా అలంకరించిన నావపై శ్రీదేవి, భూదేవి సహిత నృసింహుని కల్యాణ మూర్తులను అధిష్ఠింపజేశారు. వైకుంఠవాసుని పాద స్పర్శతో పునీతమైన కృష్ణానదిలో పుణ్య స్నానాలు ఆచరించిన తీర్థజనులు పాప పరిహారం పొందేందుకు కల్యాణోత్సవాల్లో ఉభయ నాంచారులతో స్తంభోద్భవుడు జల విహారం చేస్తారని యాజ్ఞీకులు పేర్కొన్నారు. హంస వాహనంపై ఆశీనులైన మూర్తులకు అర్చకులు రాజోపచారాలతో చతుర్వేద పారాయణ చేశారు. జగన్మోహనుడైన యోగానందునికి నృత్య, గాన, సంకీర్తనలతో నదీ విహారం చేయించారు. ఉదయం ప్రభాత సేవల అనంతరం అభిషేకాలు, రాజ్యలక్ష్మి అమ్మవారికి సహస్ర కుంకుమార్చనలు జరిగాయి. మధ్యాహ్నం ఆలయ యజ్ఞశాలలో శ్రీసూక్త సహిత మహాలక్ష్మి యాగం, తదుపరి సప్తర్షి పూజలు జరిగాయి. వశిష్ట, గౌతమ, అత్రి, జాబాలి, విశ్వామిత్రాది మహర్షులను ఆవాహనం చేసి అర్చనాదులు చేపట్టారు. నారసంహుడు పురవీధుల్లో ఊరేగాక ఆలయ ప్రవేశం తదనంతరం సదస్యం, మహదాశీర్వచనం, ఫలప్రదాన క్రతువులతో ప్రధాన ఘట్టం ముగిసింది. పిడుగురాళ్లలోని శ్రీ రామతీర్థ సేవాశ్రమం మహిళా బృందం ఆధ్వర్యంలో లక్ష్మీనృసింహ అఖండనామ సంకీర్తన జరిగింది.

నేడు శ్రీస్వామికి వసంత సేవ 
కల్యాణోత్సవాల్లో ఐదో రోజు మంగళవారం భక్తులు నదీతీరంలో వసంత సేవ నిర్వహిస్తారని ఛైర్మన్‌ చెన్నూరి మట్టపల్లిరావు, ఈవో జి.కొండారెడ్డి తెలిపారు. చక్రతీర్థం అనంతరం అన్తహోమాలు ఉంటాయన్నారు. నవకుంభాధి జలతీర్థ ప్రోక్షణ, పూర్ణాహుతి తదుపరి తిరుమంగయాళ్వారాదుల చరిత్ర పఠిస్తూ దోపు ఉత్సవం, అశ్వవాహనోత్సవం, ధ్వజావరోహణం నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఆగమ ప్రవర బీవీ వాసుదేవాచార్యులు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమాల

ధర్మకర్త చెన్నూరు విజయకుమార్‌, అర్చకులు టి.శ్రీనివాసాచార్యులు, రామాచార్యులు, కృష్ణమాచార్యులు, లక్ష్మణాచార్యులు, పద్మనాభాచార్యులు, బ్రహ్మాచార్యులు, రామకృష్ణ పాల్గొన్నారు.