ఉస్మానియా పరిధికి కోత


స్మానియా విశ్వవిద్యాలయం పరిధికి ప్రమాదం పొంచి ఉంది. దీని అనుబంధ కళాశాలల సంఖ్యకు భారీగా కోతపడనుంది. ఇప్పటికే తెలంగాణ, పాలమూరు, మహాత్మా విశ్వవిద్యాలయాలు ఏర్పడిన ప్రతీసారి ఉస్మానియా కళాశాలకు ఉన్న అనుబంధ కళాశాలల సంఖ్యలో కోతపడుతూ వచ్చింది. తాజాగా కేంద్రం రూపొందిస్తోన్న మార్గదర్శకాలతో మరింత ముప్పు వాటిల్లనుంది. ఇక నుంచి దేశంలో ఏ విశ్వవిద్యాలయానికైనా సుమారు 200 అనుబంధ కళాశాలలు మించకూడదనేది నిబంధన పెట్టనుంది. ఈ నిబంధన పాటించేవాటికే రుసా(రాష్ట్రీయ ఉచ్ఛతార్‌ శిక్షా అభియాన్‌) నిధులు అందుతాయని స్పష్టం చేస్తోంది. ఇదే జరిగితే ఉస్మానియా వైభవం మసకబారుతుంది. ప్రస్తుతం ఓయూకి 720కిపైగా అనుబంధ కళాశాలలతో విజయవంతంగా సాగుతోంది. గతంతో ఈ సంఖ్య 1200కు పైగా ఉండేది. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యంత వైభవంతో ఉస్మానియా వెలుగొందింది. పొరుగు రాష్ట్రాల వారు సైతం ఇక్కడకు వచ్చి చదువుకునే వారు. వందేళ్లలో ఎన్నో విశ్వవిద్యాలయాలకు ఉస్మానియా పుట్టినిల్లుగా మారింది. ప్రస్తుతం కేంద్రం తీసుకోబోయే నిర్ణయం అమలులోకి వస్తే మరింత ఇబ్బందులు తప్పేటట్లులేవు. ఉస్మానియా పరిధి 200 కళాశాలలకే పరిమితం అయితే ఆర్థిక కష్టాలు మరింత పొంచిఉంటాయి. ప్రస్తుతం ఓయూకి అనుబంధ గుర్తింపు కళాశాలలే పెద్ద ఆర్థిక వనరుగా ఉన్నాయి. వీటికే కోత పడితే వర్సిటీకి గడ్డు పరిస్థితేనని విద్యార్థి సంఘాల నాయకులు వివరిస్తున్నారు.

రుసా నిధుల పేరుతో ఇబ్బంది.. 
విశ్వవిద్యాలయాలకు రాష్ట్రాలు ఇచ్చేనిధులు నానాటికీ తగ్గిపోతున్నాయి. వర్సిటీల్లో సమస్యలను పరిష్కరించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. వందేళ్ల పండుగను ఘనంగా చేయలేని ఆర్థిక కష్టాల్లో ఉస్మానియా ఉంది. ఈ నేపథ్యంలోనే మొక్కుబడిగా ముగింపు ఉత్సవాలను పూర్తి చేసింది. ఏడాది పాటు కార్యక్రమాల జాబితాను అటకెక్కించేసింది. చేపట్టాల్సిన చాలా అభివృద్ధి పనుల ఊసే ఎత్తలేదు. పైలాన్‌ వంటి నిర్మాణాలను పట్టాలెక్కించలేకపోయింది. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఉస్మానియాకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సుమారు రూ.వెయ్యికోట్లు వస్తాయని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు భారీ ప్రణాళికలను రూపొందించాయి. అవన్నీ ఆచరణకు నోచుకోలేదు. ఇలాంటి తరుణంలో రుసా వంటి నిధులు ఎంతో ఆవశ్యం. ఇదే సాకుగా చూపించి కళాశాలలకు కోతపడితే మొదటికే మోసం ఏర్పడనుంది.

రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తే మేలు.. 
కొత్త నిబంధనలపై ఏప్రిల్‌ 30వ స్పష్టత వస్తుందని సమాచారం. ఎంతో ఘన చరిత్ర ఉన్న ఉస్మానియా ఉనికికే ప్రమాదం ఏర్పడనుంది. అనుబంధ ఓయూ కళాశాలలు 200కు తగ్గిపోతే.. వర్సిటీ గత వైభవం చరిత్రకే పరిమితం కానుంది. ఇప్పటికే దశలవారీగా ఓయూ పరిధి తగ్గిపోతూ వచ్చింది. ప్రస్తుత పరిస్థితి నుంచి గట్టేక్కాలంటే రాష్ట్రప్రభుత్వం స్పందించి కేంద్రంతో ప్రత్యేక మినహాయింపు ఉస్మానియాకు తీసుకుంటే మంచిదని విద్యారంగ నిపుణులు వివరిస్తున్నారు.