వాయిస్‌ మెస్సేజ్‌ పంపుతున్నారా?


ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌లేని యువత లేదంటే అతిశయోక్తి కాదు. స్మార్ట్‌ఫోన్‌ ఉన్న ప్రతి ఒక్కరూ దాదాపుగా వాట్సాప్‌ను ఉపయోగిస్తారు. దీంతో తన వినియోగదారుల కోసం వాట్సాప్‌ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ఇందులో భాగంగానే వీడియో కాలింగ్‌, గ్రూప్‌ వీడియో కాలింగ్‌, వాట్సాప్ పేమెంట్‌ వంటి సదుపాయాలను తీసుకొచ్చింది.

వాట్సాప్‌లో ఇప్పటికే టెక్ట్స్‌ మెసేజ్‌తోపాటు వాయిస్‌ మెసేజ్‌ను పంపే సౌలభ్యం కూడా ఉంది. ఇప్పుడు దీన్ని మరింత సులభతరం చేసింది. ఇప్పటివరకూ వాయిస్‌ మెసేజ్‌ చేయాలంటే యాప్‌లోని వాయిస్‌ రికార్డర్ ఐకాన్‌ను గట్టిగా పట్టుకుని మనం చెప్పాలనుకున్న సందేశాన్నిచెప్పి వదిలితే వెళ్లిపోయేది. ఒకవేళ ఆ ప్రాసెస్‌ జరిగే మధ్యలో ఫోన్‌కాల్‌ వచ్చినా లేదా బ్యాటరీ డౌన్‌ అయిపోయి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయినా రికార్డ్‌ చేసిన మెసేజ్‌ ఉండేది కాదు. ఇక నుంచి వాయిస్‌ మెస్సేజ్‌లను సేవ్‌ చేసే ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది.

అంతేకాదు... ఆ వాయిస్‌ మెసేజ్‌లను పంపే ముందుగానే విని తర్వాత పంపే సదుపాయం వాట్పాప్ కల్పిస్తోంది. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్‌ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో ఐఫోన్ వినియోగదారులకూ అందుబాటులోకి రానుంది.