వృద్ధులకు ఉపశమనం


భానుడు భగభగమండిపోతున్నాడు.. ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు అల్లాడుతున్నారు. వృద్ధుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పింఛన్‌ తీసుకునేందుకు తీవ్ర అవస్థలు అనుభవించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఎండదెబ్బ తగలకుండా పింఛన్ల పంపిణీకి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ తాజాగా ఆదేశాలిచ్చారు. ఈమేరకు ఉత్తర్వులు జిల్లాలోని అన్ని పట్టణాల కమిషనర్లకు, ఎంపీడీవోలకు అందాయి.

జిల్లాలో ఎన్టీఆర్‌ భద్రత భరోసా పింఛన్‌ పంపిణీ కింద వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులు, ఇతరులకు కలిపి 3,91,763 మందికి ప్రతినెలా పింఛన్‌ సొమ్మును ప్రభుత్వం అందిస్తోంది. వీరికి మే నెలకు సంబంధించి ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యే పంపిణీ సమయాలను మార్పు చేశారు. అన్నిచోట్ల ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు అందించేలా చర్యలు తీసుకునేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి. ఆయా ప్రాంతాల్లో నీడ, మంచినీటి వసతి వంటివి కల్పిస్తూ.. అసౌకర్యం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పంపిణీ జరిగే గ్రామ, వార్డుల్లో ప్రదేశాల సమాచారాన్ని ముందుగా పింఛనుదారులందరికీ తెలపాలి. పింఛను పంపిణీ కేంద్రాలకు రాలేని దివ్యాంగులు, మంచంపై ఉన్నవారి ఇళ్లకు వెళ్లి ప్రతినెల పింఛన్లు అందజేయాలి. పింఛనుదారులు ఎక్కడైనా పింఛను సొమ్మును తీసుకోవచ్చని ప్రచారంతోపాటు అమలు చర్యలు చేపట్టాలి. ప్రతి వార్డు, గ్రామాల్లో తప్పనిసరిగా 95 శాతం పింఛన్‌ పంపిణీ జరగాలి. ఏప్రిల్‌ నెలలో 3,61,981 మందికి మాత్రమే పింఛన్‌ సొమ్ము అందగా.. 29,782 మందికి పంపిణీ కాలేదు. అభిప్రాయ సేకరణలో 29 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతకుముందు మార్చి నెలలో ఇదే పరిస్థితి. జిల్లా మొత్తమ్మీద 159 గ్రామాల్లో, పట్టణాల్లోని 76 వార్డుల్లో 90 శాతం కన్నా తక్కువ మందికి పింఛన్లు అందాయి. ప్రతినెల సకాలంలో పింఛన్‌ మొత్తాలను ఆయా అధికారులు పంపిణీ చేయాల్సి ఉన్నా కొన్నిచోట్ల జరగకపోవడంపై అసంతృప్తి వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఇక నుంచి అనుకున్న లక్ష్యం మేరకు 95 శాతం పంపిణీతోపాటు పింఛనుదారుల్లో సంతృప్తి పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.