తిరుగు పయనంలో.. విషాద గీతిక


కర్నూలు నేరవిభాగం, అలంపూర్‌, న్యూస్‌టుడే: వారిది పెద్ద కుటుంబం.. ఏ శుభకార్యం జరిగినా అందరూ హాజరవుతారు. ఏ కష్టమొచ్చినా కలసి కట్టుగా దానిని పరిష్కరించుకుంటారు. అలా ఆనందంగా సాగిపోతున్న ఆ కుటుంబంలో పెను విషాదం చోటుచేసుకుంది. రహదారి ప్రమాదంలో ఇంటి పెద్దతోపాటు కుమార్తె, మేనకోడలిని బలి తీసుకుంది. మరో పది నిమిషాల్లో ఇంటికి చేరతామనగా జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. అతి వేగంతో వెళుతున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న ఇనుప బోర్డును ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి.  కర్నూలు నగరంలోని చిదంబరరావు వీధిలో నివసిస్తున్న కిరణ్‌సింగ్‌ ప్లాస్టిక్‌ సంచుల వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవారు. ఇతనికి ఇద్దరు సోదరులు, చెల్లెలు ఉన్నారు. ఆయన అన్న, చెల్లెలు గతంలో చనిపోయారు. కిరణ్‌సింగ్‌కు భార్య గాయత్రీ, కుమారుడు, కుమార్తె అశ్రితబాయి సంతానం. అతని తండ్రి చనిపోగా తల్లి తన వద్దే ఉంది. చెల్లెలు మంగాబాయి చనిపోవటంతో మేనకోడలు గాయత్రీబాయిని తనే చేరదీసి పోషిస్తున్నారు. కిరణ్‌సింగ్‌ భార్య గాయత్రీబాయి పెద్దమ్మ కుమారుడి వివాహానికి రెండు రోజుల క్రితం హైదరాబాద్‌ వెళ్లారు. ఆదివారం శుభకార్యం ముగించుకొని అర్ధరాత్రి 12 గంటల సమయంలో తిరుగు ప్రయాణమయ్యారు. సోమవారం తెల్లవారుజామున 5.30 సమయంలో అలంపూర్‌ చౌరస్తా ఉత్తరా ఫుడ్స్‌ సమీపంలోకి రాగానే వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న ఇనుప బోర్డును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కిరణ్‌సింగ్‌(45), కుమార్తె అశ్రితబాయి(18), మేనకోడలు గాయత్రీబాయి(19) మృతి చెందగా అతని భార్య గాయత్రి, వదిన విజయలక్ష్మి, బంధువుల కుమారుడు విజిత్‌సింగ్‌కు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న సీఐ రజితరెడ్డి, ఎస్సై గడ్డం కాశీ ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మూడు నెలల క్రితమే కొనుగోలు 
కిరణ్‌సింగ్‌ మూడు నెలల క్రితమే కొత్త కారును కొనుగోలు చేశారు. ఆయన మూడు రోజులుగా పెళ్లి పనుల్లో ఉండడంతో నిద్ర కూడా సరిగా లేదని బంధువులు వివరించారు. కాగా మృతదేహాలకు శవపరీక్ష అనంతరం కర్నూలులో అంత్యక్రియలు నిర్వహించారు. ప్రమాద విషయం కిరణ్‌సింగ్‌ తల్లికి చివరి నిమిషం వరకు చెప్పలేదు. చివరికి మృతదేహాలను తీసుకొచ్చాక విషయం తెలియడంతో ఆమె తీవ్రంగా విలపించారు.

వైద్యురాలు కావాలనుకుని.. 
కిరణ్‌సింగ్‌ కుమార్తె అశ్రితబాయి చిన్నప్పటి నుంచి చదువుల్లో మేటి. డాక్టర్‌ కావాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. తల్లిదండ్రులు కూడా ఆమెను అన్నివిధాల ప్రోత్సహించేవారు. ఇంటర్మీడియట్‌లో బైపీసీ తీసుకుని 958 మార్కులు తెచ్చుకున్నారు. ఎంసెట్‌ రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న క్రమంలో రహదారి ప్రమాదంలో ఆమె మృత్యువాత పడ్డారు.