హద్దు మీరితే అడ్డుకొనేవారేరి!


అతను పాలనను పటిష్ఠంగా అమలు చేసే వ్యక్తి.. నగరం నడిబొడ్డున 200 గజాల స్థలం కొన్నారు. వెంటనే సరిహద్దు రాళ్లు వేయించారు. మరో వారం తర్వాత చుట్టూ ఇనుపకంచె నిర్మించారు. నెలకోసారి వెళ్లి ఆ స్థలాన్ని చూసుకొని వస్తున్నారు. సొంత ఆస్తి విషయంలో అత్యంత శ్రద్ధ వహిస్తున్నారు. మరి రూ.కోట్ల విలువ చేసే హద్దులు లేని ప్రభుత్వ భూములు కళ్లెదుటే ఆక్రమణలకు గురవుతుంటే.. ఒకరి నుంచి ఇంకొకరికి చేతులు మారుతుంటే.. తమ సొంత ఆస్తుల్లా పంపకాలు జరిపేస్తుంటే.. ‘మనకెందుకులే’ అని కొందరు కళ్లు మూసుకుంటున్నారు. ప్రభుత్వ భూములకు హద్దులు లేవు. ఆక్రమణలకు అడ్డేలేదు.

జిల్లాలో వందలాది ఎకరాల అటవీ, మడ అడవులు, తీర ప్రాంత భూములున్నాయి. వీటి రక్షణ నామమాత్రమే. ఇటీవల కాలంలో బందరు మండలం పెదపట్నం, కృత్తివెన్ను మండలం ఇంతేరు గ్రామాలలో భూఆక్రమణలు అధికమయ్యాయి. మడ అడవులు నరికివేతకు గురవుతున్నాయి. ఆక్రమిత భూముల్లో చెరువులు తవ్వి క్రయవిక్రయాలు చేస్తున్నారు. ఇంతేరులో శ్మశాన భూమి కూడా విక్రయం జరగ్గా సర్పంచి అడ్డుపడటంతో తాత్కాలికంగా అడ్డుకట్ట పడింది. 
* బందరు మండలం పెదపట్నం వంతెన వద్ద అడవులను నరికి చెరువుగా చేశారు. దానికి పట్టాలున్నాయంటూ అధికారులే మద్దతు పలుకుతున్నారు. ఈ గ్రామంలో మరో 100 ఎకరాల అడవులను చెరువులుగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఆక్రమణలిలా.. 
*  కృత్తివెన్ను మండలం ఇంతేరులో 5,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇక్కడ హద్దులు లేవు. కొంతమేర ఆక్రమణల పర్వం సాగుతోంది. ఇక్కడఎకరం రూ. 7 లక్షల నుంచి రూ. 8 లక్షల ధర పలుకుతోంది. ఈ గ్రామానికి వీఆర్‌వో,  వీఆర్‌ఏ లేరు. ఇన్‌ఛార్జిలతో కాలం గడుస్తోంది. ఇటీవల కాలంలో చెరువుల తవ్వకాలు ఊపందుకున్నాయి. 
* కృత్తివెన్ను మండలం నిడమర్రులో 500 ఎకరాల ఖాళీ ప్రభుత్వ భూమి ఉంది. నిడమర్రు వరకూ గోగులేరును ఆనుకొని పడతడిక గ్రామంలో పోడు 1000 ఎకరాలుంది. కొంత మేర ప్రభుత్వం పట్టా ఇచ్చింది. దీన్ని కూడా అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు. 
* చినగొల్లపాలెంలో 2 వేల ఎకరాల వరకూ ప్రభుత్వ స్థలం ఉంది. ఈ భూమిని పంచుకొని సరుగుడు తోటలు వేసుకుంటున్నారు. 
* మోల్లపర్రు గ్రామంలో 1000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. చాలా మేరకు సరుగుడు తోటలు వేశారు.. పశ్చిమగోదావరి జిల్లా పేరుపాలెం బీచ్‌కు ఈ గ్రామం కిలోమీటరు దూరంలో ఉంది. వర్షాకాలం సముద్రం మేటలు వేసే సమయంలో సరుగుడు మొక్కలు నాటడం పరిపాటిగా మారింది. 
* సముద్ర తీర ప్రాంత మండలాల్లో ప్రభుత్వ భూములన్నీ అటవీ, రెవెన్యూ శాఖల పరిధిలో ఉన్నాయి. నాగాయలంక, కోడూరు, మచిలీపట్నం, కృత్తివెన్ను మండలాల పరిధిలో ఎక్కువ శాతం మేర అటవీశాఖ పరిధిలో ఉన్నాయి. 
* అటవీ శాఖకు సంబంధించిన భూముల్లో  నాగాయలంక మండలం ఎదురుమొండి, దీవులు తదితర ప్రాంతాల్లో కొంత మేర ఆక్రమణలకు గురై సాగు భూములుగా మారాయి. కొన్ని సంవత్సరాల క్రితం సాగుదారుల నుంచి వాటిని స్వాధీనం చేసుకున్నారు. 
* రెవెన్యూ శాఖ పరిధిలో వచ్చే తీర ప్రాంత మండలాల్లోని వేలాది ఎకరాలు  ఆక్రమణలకు గురవుతూ వచ్చాయి. వాటిలో చాలావరకు  వక్రమార్గాన పట్టా భూములుగా రూపాంతం సంతరించుకున్నాయి. వీటిలో కొంత సాగు ఉండగా, ప్రస్తుతం ఎక్కువ శాతం చెరువులుగా మారాయి. 
* నాగాయలంక, కోడూరు మండలాల్లో అటవీ, రెవెన్యూ శాఖల భూములకు కొంతవరకూ హద్దులున్నాయి. 
* మచిలీపట్నం, కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాల పరిధిలో పూర్తి స్థాయిలో ఎవరి అధీనంలో ఎంత మేర భూములున్నాయన్న లెక్క లేదు. ఇటీవల కాలంలో వాటిని గుర్తించే విధంగా సర్వే పనులు చేయాలని నిర్ణయించినా పూర్తిగా అమలుకు నోచుకోలేదు. 
* మచిలీపట్నం మండల పరిధిలో అధికారిక లెక్కల ప్రకారం తీరప్రాంత గ్రామాల్లో రెవెన్యూ భూములు లేవు. గతంలో దాదాపు ఐదు వేల ఎకరాలు భూములుండగా వాటిని పలు సందర్భాల్లో పంపిణీ చేశారు. అసైన్డ్‌ భూములను లబ్ధిదారులు అనుభవించే హక్కు మాత్రమే ఉంటుంది. దాదాపు తీర ప్రాంతమంతా క్షారస్వభావ నేలలు కావడంలో లబ్ధిదారులు వాటి గురించి పట్టించుకోలేదు. 
* ఆక్వా సాగు ప్రారంభమయ్యాక అసైన్డ్‌ మొత్తం ఇష్టానుసారం చేతులు మారిపోయాయి. కొన్నింటికి రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం వాటికి పాసుపుస్తకాలు  పుట్టించుకోవడం వంటి అక్రమాలు జరిగిపోయాయి. ‌్ర ప్రభుత్వ భూములు విస్తారంగా ఉండాల్సిన మంగినపూడి, తపసిపూడి, కరగ్రహారం, కోన, పోలాటితిప్ప తదితర ప్రాంతాల్లో  నేడు ఒక్క ఎకరం కూడా కనిపించే పరిస్థితి లేదు. 
* పోర్టు, అనుబంధ పరిశ్రమల ఏర్పాటు నేపథ్యంలో తీరప్రాంత గ్రామాల్లోని అసైన్డ్‌, ప్రభుత్వ భూములను ఇప్పటికే ఆ శాఖకు అప్పగించారు. 
* నాగాయలంక మండల పరిధిలోని తీర ప్రాంత గ్రామాల్లోని ప్రభుత్వ భూములు ఏనాడో కనుమరుగయ్యాయి. సహజంగా కరకట్టకు ఆవల భూముల్లో అతి స్వల్ప శాతం మినహా మిగిలినవన్నీ రెవెన్యూ, అటవీ శాఖలకే చెందుతాయి. ఒకప్పుడు నాలుగు వేల హెక్టార్ల వరకూ ఉండాల్సిన భూములు ప్రస్తుతం లెక్కల్లోకి వచ్చే  పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థకు అవసరమైన దాదాపు నాలుగు వందల ఎకరాలను కూడా సాగుదారుల వద్ద నుంచి తీసుకోవాల్సి వచ్చింది. 
* కోడూరు మండల పరిధిలోని తొమ్మిది రెవెన్యూ గ్రామాల పరిధిలో ఉండాల్సిన దాదాపు 24,000 ఎకరాల ప్రభుత్వ భూములను పంపిణీ చేస్తూ వచ్చారు. అధికారిక లెక్కల ప్రకారం 18,000 ఎకరాలు పంపిణీ చేయగా వాటిలో దాదాపు 10,000 ఎకరాలకు పైగా అన్యాక్రాంతమయ్యాయి. 
* మందపాకల, రామకృష్ణాపురం, బసవవానిపాలెం, తదితర గ్రామాల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములు కూడా కుంటలు, మురుగు కాలువలు, పొరంబోకు డొంకలు తదితర రూపాల్లో ఉన్నాయి.