కోనలో కనువిందుగా తెప్పోత్సవం


పెంచలకోన(రాపూరు), న్యూస్‌టుడే : రాపూరు మండలం పెంచలకోన పుణ్యక్షేత్రంలో శ్రీ ఆదిలక్ష్మి సమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం పుష్కరిణిలో వైభవంగా తెప్పోత్సవం నిర్వహించారు. పలు రకాల వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఈ కార్యక్రమం సాగింది. వసంతోత్సవం, చక్రస్నానం నిర్వహించారు. ఈమేరకు పూజారులు, భక్తులు ఆలయ మాజీ పాలకవర్గ కమిటీ సభ్యులు రంగులు చల్లుకోవడం, వసంతాలు చల్లుకోవడం, డప్పుకొట్టడం లాంటి కార్యక్రమాలతో భక్తులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. అశ్వవాహనసేవ, రాత్రి ధ్వజావరోహణం నిర్వహించారు. ఈవేడుకల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని తిలకించారు. అనంతరం పెనుశిల లక్ష్మీనరసింహస్వామి ఆదిలక్ష్మితోపాటు ఆంజనేయస్వామి గొల్లబోయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈసందర్భంగా భక్తుల ఏర్పాట్లను ఆలయ ఇన్‌ఛార్జి సహాయ కమిషనర్‌ వేగూరు రవీంద్రరెడ్డి, తానంకి నానాజీ పర్యవేక్షించారు. ఈ వేడుకల్లో కోన దేవస్థాన అర్చకులు పెంచల నరసింహయ్య, గుండ్లూరు సీతారామయ్య అండ్‌ బ్రదర్స్‌, సైదాపురం మండలం తురిమెర్లకు చెందిన పుష్కరిణి నిర్మాణ దాత మేడికొండ వెంకయ్యనాయుడు జ్ఞాపకార్థం ఆయన కుమారుడు మేడికొండ పద్మమోహన్‌చౌదరి ఉభయదాతలుగా వ్యవహరించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

ఆశ్రమంలో భక్తుల విడిది : రాపూరు మండలం పెంచలకోనలో వెలసిన  మాతృదేవి విశ్వశాంతి ఆశ్రమంలో  బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఆశ్రయం కల్పించారు. నాలుగు రోజుల పాటు ఆశ్రమానికి వచ్చిన భక్తులకు అన్నదానం చేసి భక్తుల ఆకలితీర్చారు. బ్రహ్మోత్సవాల విధుల నిర్వహించడానికి విచ్చేసిన అన్ని శాఖల అధికారులకు విశ్రాంతి గదుల్ని ఉచితంగా కేటాయించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.

నేడు గ్రామోత్సవం : పెంచలకోన బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉత్సవ మూర్తులను పెంచలకోన నుంచి పల్లకీ ద్వారా పెంచల నరసింహస్వామి అత్తగారిల్లుగా పిలువబడుతున్న గోనుపల్లికి తరలిస్తారు. మొదట ఉత్సవమూర్తులను గిరిజన కాలనీ వద్ద దింపుతారు. సాయంత్రం దాకా ఇక్కడే ఉంచి రాత్రి గ్రామోత్సవం నిర్వస్తారు. ఈ గ్రామోత్సవంతో కోన బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.