‘మహానటి’ కోసం ఎన్టీఆర్‌!


హైదరాబాద్‌: మహేష్‌బాబు ‘భరత్‌ అనే నేను’ చిత్ర ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు హాజరై సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు ఎన్టీఆర్‌. అగ్ర కథానాయకులందరూ ఒకరి కార్యక్రమాలకు మరొకరు వస్తారని మహేష్‌ కూడా చెప్పేశారు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్‌ మరో ఈవెంట్‌కు హాజరుకానున్నారు. అలనాటి తార సావిత్రి జీవితం ఆధారంగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మహానటి’. కీర్తి సురేష్‌ టైటిల్‌రోల్‌ పోషిస్తున్నారు. మిక్కీ జె మేయర్‌ స్వరాలు సమకూర్చారు. మంగళవారం ఈ చిత్ర ఆడియో విడుదల వేడుక జరగనుంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఎన్టీఆర్‌ రానున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఎన్టీఆర్‌ రాక ఈ ఈవెంట్‌కు మరింత ఆకర్షణ తెస్తుందని అంటున్నారు.

ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘మహానటి’ని మే 9న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. చిత్రంలో నటించిన ప్రతీ నటుడు సొంతంగా డబ్బింగ్‌ చెప్పడం విశేషం. సమంత, విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌, మోహన్‌బాబు, రాజేంద్రప్రసాద్‌ ఇలా ఎంతోమంది ఈ చిత్రంలో నటిస్తున్నారు.

ఇందులో అక్కినేని నాగేశ్వరరావుగా నాగచైతన్య కనిపిస్తారని సమాచారం. అయితే ఎన్టీఆర్‌ పాత్రలో ఎవరు కనిపిస్తారన్నది మాత్రం ఇప్పటివరకూ చిత్ర బృందం వెల్లడించలేదు. ఆ సర్‌ప్రైజ్‌ తెలియాలంటే మే9 వరకూ వేచి చూడాల్సిందే!