ఆ సంతోషం ఎక్కువసేపు ఉండనివ్వలేదు: చిరు


హైదరాబాద్‌: ‘రంగస్థలం’ సినిమాలో చరణ్‌ నటనకు వచ్చిన ప్రశంసలు, అభినందనలతో తండ్రిగా చాలా గర్వపడ్డానని అగ్ర కథానాయకుడు చిరంజీవి అన్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న చిరు తన తనయుడి గురించి మాట్లాడారు. రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టిన తన సినిమా ‘ఖైదీ నంబర్‌ 150’ గురించి ప్రస్తావించారు.

‘మీ ఆదరణ వల్ల ‘ఖైదీ నంబర్‌ 150’ సినిమా నాన్‌ ‘బాహుబలి’ పరంగా నం.1గా నిలిచింది. అయితే ఆ సంతోషం ఎక్కువ సేపు ఉండనివ్వలేదు (‘రంగస్థలం’ రికార్డు గురించి) అని చిరు నవ్వుతూ అన్నారు. ఆయన జోక్‌కు అక్కడున్న వారంతా ఒక్కసారిగా కేకలు వేస్తూ నవ్వారు. ఓ వ్యక్తి ‘మన సైరా వస్తోంది సర్‌’ అని చెప్పగా ‘మనం ఆ రికార్డు బ్రేక్‌ చేద్దాం’ అని చిరు స్పందించారు.

అనంతరం మెగాస్టార్‌ భావోద్వేగానికి గురయ్యారు. ‘నిజంగానే తండ్రిగా ఆ పుత్రోత్సాహం అనుభవించే నాకు... దాన్ని మాటల్లో వర్ణించలేను. ఇంతకంటే ఆనందం ఏముంటుంది. ‘రంగస్థలం’ సినిమాకు సంబంధించి చరణ్‌ ఇలా చేశాడు, చాలా చక్కగా నటించాడు అని అందరూ అంటుంటే గర్వపడ్డా’ అని ఆయన పేర్కొన్నారు.

చిరంజీవి ప్రస్తుతం ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో నటిస్తున్నారు. సురేందర్‌ రెడ్డి దర్శకుడు. కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై రామ్‌చరణ్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగుతోపాటు హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్‌, నయనతార, విజయ్‌ సేతుపతి, తమన్నా, జగపతిబాబు, సుదీప్‌ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కాబోతోంది.