వద్దన్న పాత్రలే ముద్దు


జడ్జ్‌మెంట్‌ అంటారు చూడండి.. కొన్నిసార్లు మనం ఆ జడ్జ్‌మెంట్‌ను సరిగ్గా చేయలేం! కారణాలు ఎన్నో ఉంటాయి దానికి! నటీనటులూ అంతే! ఎంతో అనుభవం ఉన్నా కొన్ని సందర్భాలలో కొన్ని పాత్రల విషయంలో సరైన నిర్ణయం తీసుకోవడం కష్టమైపోతుంటుంది. దానివల్ల, ఆ పాత్ర ఎవరికో దక్కి, వారు తాము వద్దన్న ఆ పాత్ర ద్వారానే మంచి పేరు తెచ్చుకుంటే, తీరికగా విచారించే పరిస్థితి ఉంటుంది. ‘ఏ స్టార్‌ ఈజ్‌ బార్న్‌’ అనేది 1954లో వచ్చిన అద్భుతమైన సినిమా. ఆ ఒక్క సినిమా వల్లనే జూడీ గార్లండ్‌, సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోయింది. ఆమెకు జోడీగా ఆ చిత్రంలో నటించమని ఆ నిర్మాణ సంస్థవారు దాదాపుగా, హాలీవుడ్‌లో పెద్ద పెద్ద తారలందర్నీ అడిగారు. అలా ఆ పాత్రను వద్దన్న వారిలో హంఫ్రీ బొగార్డ్‌, క్యారీ గ్రాంట్‌, గ్యారీ కూపర్‌, మార్లన్‌ బ్రాండో, మాంట్‌ గోమరీ క్లిఫ్ట్‌ వంటి వారంతా ఆ పాత్ర వద్దన్న వారే! క్యారీ గ్రాంట్‌ అయితే, ముందు సరేనని, తర్వాత మనసు మార్చుకుని, సినిమాలోంచి బయటకు వచ్చేసారు. చివరికి ఆ పాత్రను జేమ్స్‌ మాసన్‌  వేశారనేది విశేషం!