జపాన్‌ వ్యాధి.. గుంటూరుకొచ్చింది!


ఉన్నట్టుండి ఛాతీలో నొప్పి. ఊపిరి ఆడదు. కొద్దిసేపటికే స్పృహ కోల్పోవడం! యాంజియోగ్రామ్‌లో అంతా బాగుంది. రక్త నాళాలలో ఎక్కడా అడ్డంకులు (బ్లాక్స్‌)లేవు. అయినా... గుండె పనితీరులో విపరీతమైన మార్పులు! ఆస్పత్రికి తరలించడంలో కాస్త ఆలస్యం జరిగినా... ప్రాణాలు పోయేవే! ఇటీవల గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలల్లో కనిపిస్తున్న కొత్త తరహా గుండె జబ్బు ఇది! ఈ జబ్బును ‘టక సుబో కార్డియోమయోపతి సిండ్రోమ్‌’గా వైద్య వర్గాలు గుర్తించాయి. 90వ దశకంలో జపాన్‌లో ఇలాంటి వ్యాధిని గుర్తించారు. అప్పట్లో సునామీ వల్ల లక్షలాదిమంది జపనీయులు తమ ఇల్లూ వాకిళ్లు కోల్పోయారు. ఆత్మీయులకు దూరమయ్యారు. తీవ్ర మానసిక ఒత్తిడికి గురై మరణించారు. విచిత్రంగా... మృతులందరిలో గుండె పరిమాణం పెరిగినట్లు వైద్యులు గమనించారు.