గుండె సైజు పెరిగిన రోగికి అరుదైన చికిత్స


మహానగరాల్లో జరిగే ఆధునిక గుండె చికిత్స విధానాలు కర్నూలులో అందుబాటులోకి వచ్చాయి. రాయలసీమలో మొట్టమొదటి సారిగా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద నగరంలోని శ్రీ విజయదుర్గా కార్డియాక్‌ సెంటర్‌లో గుండె సైజు పెరిగిన ఓ రోగికి వైద్యులు అరుదైన చికిత్స అందించారు. ఈ సందర్భంగా హాస్పిటల్‌లో సీనియర్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ వసంతకుమార్‌,  విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణానికి చెందిన షేక్‌కైరుథ్‌ గుండెనొప్పితో బాధపడుతూ గత వారం రోజుల క్రితం ఆసుపత్రికి వచ్చారని, మందులు వాడిన రోగికి తీవ్రమైన నొప్పి, ఆయాసం తగ్గకపోవటం వంటి పరీక్షలు చేసినట్లు వివరించారు. దీంతో ఆమె గుండె సైజు పెరగటం (డైలేటెడ్‌ కార్డియోమయపతి) వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించినట్లు వివరించారు. ఈరోగికి గుండె మార్పిడి గాని కార్డియాక్‌ రీసైన్‌ క్రోనైజేషన్‌ థెరపి గాని చేయాలని వివరించారు. గుండెమార్పిడి మంచి ఫలితం ఇవ్వనందున ఈ నెల 22న సీటీ సర్జన్‌ డాక్టర్‌ మృత్యుంజయ, మత్తుమందు వైద్యులు కొండారెడ్డి తాను కలిసి రోగికార్డియాక్‌ రీసైన్‌క్రోనైజేషన్‌ థెరపి డేఫ్రీబ్రీలేషన్‌ పరికరం అమర్చినట్లు తెలిపారు. ఈ చికిత్స వల్ల రోగి గుండెసైజు, ఆయాసం బాధ తగ్గిందని తెలిపారు. అలాగే రోగికి షాక్‌ ఇవ్వటానికి సౌకర్యం కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు.