ఆస్తమా బాధితుల్లో ఐటీ ఉద్యోగులు అధికం


ఉద్యోగులు, విద్యార్థులు ఉదయం ఆఫీసులు, పాఠశాలలు, కాలేజీలు.. తిరిగి వచ్చాక ఇంటికే పరిమితమవడం వల్ల మిలియన్ల సంఖ్యలో దుమ్ము, ధూళి కణాలు ఊపిరితిత్తులోకి వెళ్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఇంట్లో ఉండే సోఫాలు, దిండ్లు, బెడ్స్‌, బెడ్‌షీట్లు ఎక్కువ కాలం అలాగే పడేవేసే దుస్తులపై హౌస్‌ డస్ట్‌ మైట్స్‌ ఉంటాయని, ఇవీ కేవలం మన శరీరంపైనే బతుకున్నాయని డాక్టర్‌ నవనీత సాగర్‌రెడ్డి వివరించారు. ఫ్యాన్‌ గాలి, ఏసీ మొహానికి నేరుగా తగేలా విధంగా ఉన్నా ఊపిరితిత్తులకు సమస్యేనని హెచ్చరిస్తున్నారు.

 
ముప్పై ఏళ్ల క్రితం వందలో ఒకరిద్దరికి...
ముప్పై ఏళ్ల క్రితం నగరంలో ఆస్తమా వంద మందిలో ఒకరిద్దరికి ఉందంటే భయపడే వాళ్లమని, ఇప్పుడు ఆ సంఖ్య అయిదారుగురికి చేరుకుందని వైద్యులు చెబుతున్నారు. 1993లో మూడు శాతం ఉన్న ఆస్తమా బాధితుల సంఖ్య ఇప్పుడు ఆరుశాతానికి పెరిగిందంటున్నారు. విటమిన-డి లోపం కారణంగానూ ఆస్తమా ఎక్కువవుతుందని వైద్యులు వివరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సూర్యకిరణాలు తగలని వారు చాలామంది ఉన్నారని, వారిలో రోగ నిరోధకశక్తి తగ్గి సమస్య తీవ్రత పెరుగుతుందని పేర్కొంటున్నారు.