సూర్యకాంతితో అనారోగ్యం దూరం!


ఎండలో పనిచేయడం లేదా, నడవడం అనేవి ప్రస్తుత పరిస్థితుల్లో చాలా తక్కువైపోయింది. దీని  వల్ల శరీరానికి అందాల్సిన విటమిన్‌ డి తక్కువై పలు ఆరోగ్యసమస్యలకు గురవుతున్నారు కొందరు. ముఖ్యంగా విటమిన్‌ డి తగ్గి కొన్నిరకాల కేన్సర్లు చుట్టుముట్టే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సూర్యకాంతి ద్వారా లభించే విటమిన్‌ డికి ప్రత్యామ్నాయంగా మందులు తీసుకున్నా ఫలితం ఉండదని వారంటున్నారు. ప్రతిరోజూ పిల్లలకు రెండువందల యూనిట్లు, పెద్దలకు 400 యూనిట్లు విటమిన్‌–డి అవసరం. కానీ మందుల ద్వారా వందయూనిట్లు మాత్రమే లభ్యమవుతుందని స్పష్టం చేస్తున్నారు. విటమిన్‌ డి లోపం వల్ల ఆరోగ్యసమస్యలు రాకుండా ఉండాలంటే ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం కొంతసేపు ఆరుబయట గడపడం చాలా అవసరమంటున్నారు. రోజూ ఉదయాన్నే నడక అలవాటు చేసుకుంటే రోజుకు కావలసిన విటమిన్‌ డిలో చాలాభాగం శరీరానికి అందుతుందనీ, సాయంత్రం సమయంలో పిల్లలతో పార్కులో కొంత గడిపితే మిగతాభాగం విటమిన్‌ డి శరీరానికి లభిస్తుందంటున్నారు.